ఏపీలో కేసీఆర్‌ ను ఇబ్బంది పెట్టే అంశాలివేనా?

Update: 2023-01-04 10:45 GMT
టీఆర్‌ఎస్‌ ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ విస్తరణపై కేసీఆర్‌ దృష్టిపెట్టారు. ఇప్పటివరకు వేరే రాష్ట్రాల నుంచి పేరున్న ఒక్క నేత కూడా బీఆర్‌ఎస్‌ లో చేరలేదు. చివరకు ఏపీ నుంచి తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌ బాబు లాంటివారు మాత్రమే ఆ పార్టీలో చేరారు.

ముఖ్యంగా దేశంలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌ లో కొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ మంచి స్థానాలు సాధిస్తుందని కేసీఆర్‌ నమ్ముతున్నారు. అయితే మిగతా రాష్ట్రాల్లో లేని ఇబ్బంది కేసీఆర్‌ కు ఏపీలో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావమే.. ఆంధ్రా వ్యతిరేకత. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తర్వాత రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్‌ ఆంధ్రులను దూషించడం మానలేదంటున్నారు. ఆంధ్రా సంస్కృతిని, ఆహారాన్ని, ప్రజలను కించపరుస్తూ చాలాసార్లు కేసీఆర్‌ మాట్లాడారు. ఏకంగా బ్రిటిష్‌ వాళ్లతో పోల్చి వలస పాలకులని, దొంగలని నిందించారు. ఇక ఆ పార్టీ నేతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అధినేత బాటలోనే ఆంధ్రులపై ఇష్టానుసారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాడు ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య తన మాటల ద్వారా విద్వేషాలు నింపిన కేసీఆర్‌ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తారని ఆయనపై గట్టిగానే విమర్శలు పడుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల నేతలు కేసీఆర్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్పి ఆంధ్రాలో ఓట్లు అడగగలరని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి, రాజధాని లేకుండా మిగిలిపోవడానికి, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోవడానికి కేసీఆర్‌ కారణమని ఏపీ ప్రజలు బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఆయన తెలంగాణను విడగొట్టకపోయి ఉంటే తమకు ఇంత కష్టాలు వచ్చి ఉండేవి కావని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు.

మరోవైపు పోలవరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కొర్రీలు, ఏపీకి రావాల్సిన ఆస్తులను పంచకపోవడం, పైగా ఏపీనే తమకు బాకీ ఉందని వాదనకు దిగడం, వీటిపైన కోర్టుల్లో కేసులు వేయించడం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ల్లో అక్రమ పద్ధతుల్లో కరెంటు ఉత్పత్తి చేసి ఏపీ ప్రయోజనాలను గండికొట్టడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మాకు కూడా ఇవ్వాల్సిందేనని అడ్డుపడటం ఇలా పలు విషయాలు కేసీఆర్‌ కు ఇబ్బంది సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

వీటికి సమాధానాలు చెప్పకుండా ఏపీకి వచ్చి ఓట్లు అడిగితే వేయడానికి ఏపీ ప్రజలేమీ అమాయక గొర్రెలు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఇమేజ్‌ కూడా లేని తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌ బాబు లాంటివారు చేరినా బీఆర్‌ఎస్‌ ఏపీలో చూపించే ఫలితం సున్నా అని కుండబద్దలు కొడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News