వీళ్లేనా ఎంఎల్సీ అభ్యర్థులు ?

Update: 2021-11-10 04:30 GMT
ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ పదవులకు అధికార వైసీపీ తరఫున అభ్యర్ధులు ఖరారైనట్లేనా ? పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం ముగ్గురు నేతల పేర్లను జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేసినట్లే అనుకోవాలి. మూడు పదవుల్లో ఇప్పటికే డీసీ గోవిందరెడ్డికి ఒకటి రిజర్వు అయిపోయింది. మొన్నటివరకు ఎంఎల్సీగా పనిచేసిన కడప జిల్లా సీనియర్ నేత డీసీ గోవిందరెడ్డికి రెన్యువల్ ఇస్తానని గతంలోనే జగన్ హామీ ఇచ్చారట. ఈ పద్దతిలో ఒక పోస్టు గోవింద రెడ్డికి ఖరారైనట్లే.

మిగిలిన రెండు పోస్టుల్లో ఎవరిని నియమిస్తారనే విషయంలోనే నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు కూడా జగన్ ఎప్పుడో హామీ ఇచ్చారు. ఎంఎల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట టికెట్ మర్రికి కాకుండా విడదల రజనికి ఇవ్వాలని జగన్ అనుకున్న కారణంగా మర్రికి పై హామీ ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సందర్భాల్లో ఎంఎల్సీల భర్తీ చేసినా మర్రికి మాత్రం అవకాశం దక్కలేదు. ఎప్పటికప్పుడు రాజకీయ అనివార్యతల కారణంగా ఇతరులకు ఎంఎల్సీ పదవులను ఇవ్వాల్సిన రావటంతో మర్రిని ఎకామిడేట్ చేయలేకపోయారు. అయితే ఇపుడు వచ్చే మూడు ఎంఎల్సీలే కాకుండా తొందరలోనే 11 ఎంఎల్సీలు రాబోతున్నాయి. అయితే ఇప్పటి మూడింటిలోనే మర్రికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం పెరిగిపోతోంది.

ఇక మూడో ప్లేసును శ్రీకాకుళం సీనియర్ నేత పాలవలస రాజశేఖర్ కొడుకు పాలవలస విక్రాంత్ కు ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కర్నూలుకు చెందిన ముస్లిం మైనారిటీ వర్గానికి కేటాయించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏ కారణం వల్ల ప్రస్తుతం ఒకరికి మిస్సయినా తొందరలోనే భర్తీ చేయబోయే 11 స్ధానాల్లో వారికి చోటు దక్కటం ఖాయమనే అనిపిస్తోంది. ఏదేమైనా పోస్టులున్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకుందామనే అవకాశాలు నేతలకు తక్కువే. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినంత వరకు ఏ పోస్టులో ఎవరిని నియమించాలి ? ఎవరితో భర్తీ చేయాలి అనే విషయమై జగన్ చాలా నిశితంగా పరిశీలించి ఎంపికచేస్తారు.

ఇప్పటివరకు ఎంపికచేసిన అనేక పోస్టుల్లో దాదాపు స్వయంగా జగన్ కసరత్తు చేసి ఎంపిక చేసినవే. పెద్ద సంఖ్యలో భర్తీ చేసిన కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను మాత్రం మంత్రులు, ఎంఎల్ఏల ఇష్టానికే వదిలేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారు, పార్టీకి ఉపయోగపడిన వారిని మాత్రమే ఎంపిక చేయాలనే షరతు విధించి ఎంపిక వ్యవహారం మొత్తాన్ని మంత్రులు, ఎంఎల్ఏలకే జగన్ వదిలేశారు. కాబట్టి ఎంఎల్సీలను మాత్రం జగనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ఈ విషయంలో ఎవరు ఒత్తిడి పెట్టటానికి కూడా సాహసం చేయట్లేదు. ఈరోజు రాత్రికి అధికారికంగా ప్రకటన రావచ్చని అనుకుంటున్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి.



Tags:    

Similar News