అరెస్ట్ చేస్తే ర‌విప్ర‌కాశ్ బ‌య‌ట‌కు రాలేడు!

Update: 2019-06-19 05:42 GMT
టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ముంద‌స్తు బెయిల్ కు సంబంధించిన తాజా  వాద‌న‌ల్లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. మోసం.. కుట్ర‌.. డేటా చౌర్యంతోపాటు ప‌లు కేసుల్ని ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్ త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై కేసులు పెట్టిన వారు మాత్రం ఆయ‌న్ను ఎట్టి ప‌రిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందేన‌ని.. ఆయ‌న బ‌య‌ట ఉండే సాక్ష్యాల్ని మారుస్తార‌ని.. సాక్ష్యుల్ని ప్ర‌భావితం చేస్తార‌ని వాదిస్తున్నారు.

తాజాగా ర‌విప్ర‌కాశ్ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ప్ర‌తాప‌రెడ్డి వాదిస్తూ.. లిటిగేష‌న్ కోసమే రూ.100 కోట్ల విలువైన టీవీ9 లోగోను రూ.99వేల‌కు ర‌విప్రకాశ్ అమ్మేశార‌న్నారు. టీవీ9 లోగోను 15 ఏళ్ల పాటు వాడుకున్నందుకు 4 శాతం వాటా ఉంటుంద‌న్న వాద‌న‌లో అర్థం లేద‌న్నారు. టీవీ9 చాన‌ల్ కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయిలు చేతులు మారాయ‌న్న ర‌విప్ర‌కాశ్ ఆరోప‌ణ‌ను ఖండించారు.

చాన‌ల్ అమ్మ‌కానికి సంబంధించిన ఒప్పందం మొత్తం బ్యాంకు ద్వారానే రూ.500 కోట్ల లావాదేవీలు జ‌రిగిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ర‌విప్ర‌కాశ్ చేసిన ఆరోప‌ణ‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. కొత్త యాజ‌మాన్యం చ‌ట్ట‌ప్రకారం డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించింద‌ని.. ర‌విప్ర‌కాశ్ ఫోర్జ‌రీ ప‌త్రాలు త‌యారు చేసి వాటా బ‌దిలీ అయిన‌ట్లు చేశార‌న్నారు.

ఇదిలాఉంటే.. ర‌విప్ర‌కాశ్ త‌ర‌ఫు లాయ‌ర్ దిల్జీత్ సింగ్ అహ్లువాలియా వాదిస్తూ.. ముందుస్తు బెయిల్ ఇస్తే పోలీసుల విచార‌ణ‌కు ర‌విప్ర‌కాశ్ స‌హ‌క‌రిస్తార‌ని.. ఎలాంటి క‌ఠిన ష‌ర‌తులు పెట్టినా ఫ‌ర్లేద‌ని.. బెయిల్ మాత్రం ఇవ్వాల‌ని కోరారు. కావాల‌ని కేసుల్లో ఇరికించార‌ని.. ఒక‌సారి అరెస్ట్ చేస్తే ర‌విప్ర‌కాశ్ బ‌య‌ట‌కు రావ‌టం క‌ష్ట‌మ‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించ‌టం గ‌మ‌నార్హం.

కావాల‌ని మూడు కేసుల్లో ఇరికించిన‌ప్పుడు బెయిల్ ఇవ్వొచ్చ‌ని సుప్రీంకోర్టు పాత తీర్పుల్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు ముగిసిన నేప‌థ్యంలో తీర్పును త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ‌దేవి పేర్కొన్నారు. ఈ తీర్పుతో ర‌విప్ర‌కాశ్ జైలా.. బెయిలా? అన్న‌ది తేలుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News