ఫోన్ సిగ్న‌ల్ కోసం చెట్టెక్కిన కేంద్ర‌మంత్రి

Update: 2017-06-05 10:00 GMT
స‌మ‌స్య‌లు త‌మ వ‌ర‌కూ వ‌స్తే కానీ.. జ‌నాల బాధలు ఎలా ఉంటాయో అర్థం కావు. తాజాగా అలాంటి అనుభ‌వ‌మే కేంద్ర‌మంత్రికి ఎదురైంది. గ్రామాల్లో ఫోన్ సిగ్న‌ల్స్ స‌రిగా లేక‌పోవటం.. అక్క‌డ ట‌వ‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కోరినా.. ప‌ట్టించుకోక‌పోవ‌టం మామూలే. మ‌రి.. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఒక కేంద్ర‌మంత్రికి ఎదురైతే..?

ఇప్పుడు చెప్పే ఉదంతం ఇలాంటిదే. కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ‌మంత్రి అర్జున్ మేఘ‌వాల్ తాజాగా రాజ‌స్థాన్లోని త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టించారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న దూలియా గ్రామానికి వెళ్లారు. అక్క‌డి స్థానికుల‌తో మాట్లాడారు. వారికి ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు స్థానిక ఆసుప‌త్రిలో న‌ర్సుల కొర‌త ఉంద‌ని.. దీంతో త‌మ‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని చెప్పారు. దీంతో స్పందించిన మేఘ‌వాల్ వెంట‌నే ఫోన్ క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ.. అక్క‌డ సిగ్న‌ల్ స‌రిగా లేక‌పోవటంతో ఆయ‌న ఫోన్ మాట్లాడ‌టానికి తెగ ఇబ్బంది అయ్యింది. దీంతో.. సిగ్న‌ల్ కోసం.. చెట్టుకు నిచ్చెన వేసుకొని మ‌రీ.. పైకి ఎక్కారు. దాంతో ఆయ‌న‌కు సిగ్న‌ల్ అంద‌టం.. అధికారుల‌తో మాట్లాడ‌టం జ‌రిగిపోయింది. ఫోన్ మాట్లాడాలంటే త‌మ‌కున్న ఇబ్బందిని ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ ఉదంతంతో ఆ గ్రామంలో ఫోన్ మాట్లాడ‌టం ఎంత క‌ష్ట‌మైన విష‌య‌మ‌న్న‌ది కేంద్ర‌మంత్రికి అర్థ‌మైంది. మ‌రి.. ఆస్థాయి వారికి ఇబ్బంది నేరుగా అనుభ‌వంలోకి వ‌స్తే.. ఇంకేమైనా ఉందా? అందుకే ఆయ‌న రియాక్ట్ అవుతూ.. వెంట‌నే సెల్ ట‌వ‌ర్ ఏర్పాటు చేయిస్తాన‌ని మాట ఇచ్చారు. స్వానుభ‌వానికి మించింది ఇంకేం ఉంటుంది చెప్పండి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News