మోదీ మీకు క్లోజా.. రిటైర్డ్ సీజే ఏమన్నారంటే..!
ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మీకు క్లోజా అన్న ప్రశ్నపై జస్టిస్ చంద్రచూడ్ సూటిగా, స్పష్టంగా వివరణ ఇచ్చారు.
ప్రధాని మోదీ, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మధ్య సంబంధాలు మరోసారి చర్చకు వచ్చాయి. సీజేఐగా చంద్రచూడ్ బాధ్యతల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఆయన ఇంటికి వెళ్లారు. సీజేఐ కుటుంబంతో కలిసి గణపతి పూజ చేశారు. అప్పట్లో ఈ సంఘటనపై దేశంలో విపరీతమైన చర్చ జరిగింది. సీజేఐ ఇంటికి ప్రధాని ఎలా వెళతారంటూ ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ తాజాగా స్పందించారు. ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మీకు క్లోజా అన్న ప్రశ్నపై జస్టిస్ చంద్రచూడ్ సూటిగా, స్పష్టంగా వివరణ ఇచ్చారు.
‘‘రాజ్యాంగం ప్రకారం ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య మర్యాదపూర్వక భేటీని అతిగా చూడొద్దు. కేసుల తీర్పునకు ఇలాంటి మర్యాదలకు మధ్య సంబంధం ఉండదు.’’ అంటూ రిటైర్డ్ సీజేఐ వెల్లడించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను సైతం జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. రాజ్యాంగం అసలు ఉద్దేశానికి అనుగుణంగా ఆ తీర్పు ఉందని చెప్పారు.
ఇక సుప్రీంకోర్టు తీర్పుల విషయంలో రాజకీయ జోక్యం అన్న ఆరోపణలను సీజేఐ ఖండించారు. చట్టప్రకారమే కేసుల్లో నిందితులు బెయిల్ వస్తుందన్నారు. ఇందులో రాజకీయ నాయకులు అతీతులేం కాదన్నారు. గత ఏడాది 21,300 బెయిల్ పిటిషన్లు కొట్టివేశామని గుర్తు చేశారు. ఇదిలావుండగా, జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ఉండగా, ఆయన నివాసంలో నిర్వహించిన వినాయకుడి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫొటోలను ప్రధాని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. దీనిపై అప్పట్లో ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై గతంలోనూ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ప్రధాని తన ఇంటికి రావడంలో ఎటువంటి తప్పులేదన్నారు. అధికార విభజన అంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యస్థలు సమావేశం కావద్దని, చర్చించవద్దని అర్థం కాదని స్పష్టంచేశారు.