కమల్ రాజకీయం రాజ్యసభ వరకేనా ?

అంతే కాదు ఆయన చేసిన ప్రయోగాలూ ఎవరూ చేయలేదు. నటన కాదు జీవించేయడమే ఆయనకు తెలుసు.

Update: 2025-02-13 16:54 GMT

దేశం గర్వించే నటుడిగా కమల్ హాసన్ ని పేరు ఉంది. ఆయన ధరించినన్ని విలక్షణమైన పాత్రలు ఎవరూ ధరించలేదు. అంతే కాదు ఆయన చేసిన ప్రయోగాలూ ఎవరూ చేయలేదు. నటన కాదు జీవించేయడమే ఆయనకు తెలుసు. అందుకే ఆయనకు విశ్వనటుడు అని పేరు పెట్టారు. అది సార్ధక నామధేయం కూడా.

కమల్ హాసన్ ది అభ్యుదయ భావజాలం. ఆయనకు సమాజం పట్ల అవగాహన కూడా చాలా ఎక్కువ. తన కీర్తిని తన అనుభవాన్ని మేళవించి ప్రజలకు మేలు చేయాలని ఒక పార్టీ పెట్టారు. 2018లో పెట్టిన ఆ పేరే మక్కల్ నీది మయ్యం. ఈ పార్టీ పెట్టి ఆయన లోక్ సభ నుంచి స్థానిక సంస్థల వరకూ అన్ని ఎన్నికలనూ చూశారు. తన పార్టీతో పోటీ చేయించారు.

ఇక పార్టీ పెట్టిన ఏడాదిలోనే 2019లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లకూ తన పార్టీని దించారు. ఓటు శాతం అయితే 3.72గా వచ్చింది. కానీ ఒక్క సీటూ గెలవలేదు. పట్టణాలు నగరలలో మాత్రం కమల్ ప్రభావంతో పార్టీ మంచి ఓట్లనే తెచ్చుకుంది. కొన్ని చోట్ల లక్ష దాకా ఓట్లు కూడా వచ్చాయి.

ఇక 2021లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తన పార్టీ తరఫున మొత్తం అభ్యర్ధులను నిలబెట్టారు. కమల్ హాసన్ పోటీ చేశారు. అతి తక్కువ ఓట్ల తేడా అంటే 1728 మెజారిటీ తేడాతో ఓటమిని చవి చూశారు. అలా కమల్ చట్ట సభ కల మిగిలిపోయింది. ఇక 2022లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోనూ మొత్తం పార్టీని పోటీ చేయించారు. కానీ జనాలు ఆదరించలేదు.

అంటే వార్డు మెంబర్ నుంచి పర్లమెంట్ దాకా పోటీ చేసినా ఓటమి పలుకరించింది అన్న మాట. ఇలా పార్టీ పెట్టిన నాలుగేళ్ళలోనే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి తత్వం అర్ధం చేసుకున్న కమల్ హాసన్ 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేసి పెట్టారు. తన పార్టీని మాత్రం పోటీకి దించలేదు.

అదే సమయంలో డీఎంకే నుంచి ఒక హామీ కూడా లభించింది. రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఒకటి ఆయనకు ఇస్తామని జూన్ లో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవున్నాయి. అందులో ఒకటి కమల్ కి కేటాయిస్తూ అధికార డీఎంకే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డీఎంకే కీలక నాయకులు స్వయంగా కమల్ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి స్టాలిన్ సందేశాన్ని ఆయనకు తెలియచేశారు.

ఇదిలా ఉంటే తన పార్టీని తొందరలో డీఎంకేలో కమల్ విలీనం చేయబోతున్నారు. అలా ఫిబ్రవరిలో పుట్టిన పార్టీ అదే ఫిబ్రవరిలో అంటే ఏడేళ్ళ తరువాత కనుమరుగు అవుతుందన్న మాట. కమల్ ఈ రాజకీయ ప్రస్థానంలో సాధించినది ఏంటి అంటే రాజ్యసభ సీటు.

అయితే కమల్ రాజకీయాల్లో ఓటమి పాలు కావచ్చు కానీ సిద్ధాంతాలలో ఓడిపోలేదు. ఆయన లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వారు రైటిస్ట్ ఫిలాసఫీని పూర్తిగా వ్యతిరేకిస్తారు. అందుకే ఆయన రాజకీయంగా ఎంపీగానే చివరికి ఉండబోతున్నారు. కానీ అది ఆయనకు ఎంతో సంతృప్తి అని చెప్పాలి.

ఆయనే కనుక బీజేపీకి మద్దతు ఇచ్చి తన పార్టీని అందులో విలీనం చేస్తే ఏనాడో కేంద్రంలో మంత్రి అయ్యేవారు. అంతే కాదు తమిళనాడులో కమల వికాసానికి దారేదీ అని వెతుకుతున్న బీజేపీకి ఆయన సీఎం క్యాండిడేట్ కూడా అయి ఉండేవారు అని చెబుతారు. సిద్ధాంతాల కోసం రాజీపడని ఆయన నైజమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది అని చెబుతారు. మరో వైపు చూస్తే దక్షిణాదిన పార్టీలని పెట్టి విలీనం చేసి భారీ లబ్ది పొందిన వారూ ఉన్నారు.. బట్ కమల్ మాత్రం ఒక రేర్ పర్సనాలిటీ. అందుకే ఆయన పెద్దల సభకు సిసలైన పెద్ద మనిషిగా వెళ్ళబోతున్నారు.

Tags:    

Similar News