చీకటి రోజా.. అద్భుతమైన రోజా?

Update: 2019-08-05 10:31 GMT
ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న వివాదంపైనా.. సున్నితమైన అంశంపైనా నిర్ణయాలు తీసుకోవటానికి ఎంతో దమ్ము.. మరెంతో ధైర్యంతో పాటు.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా చాలా అవసరం. ఒత్తిళ్లను అధిగమించే తత్త్వంతో పాటు.. పరిణామం ఏమైనా సరే.. ధీటుగా బదులిచ్చే తెగువ చాలా అవసరం. దేశ రాజకీయాల్లో అలాంటి నేతలు చాలా పరిమితంగా మాత్రమే కనిపిస్తారు. విషయాల్ని అదే పనిగా నాన పెట్టటమే కాదు.. కాలమే బదులిస్తుందన్న మాటను చెప్పటం ద్వారా పలాయనవాదాన్ని అనుసరిస్తుంటారు. ఇలాంటి తీరుకు చెక్ పెడుతూ.. మోడీ సర్కార్ 2.0లో సంచలన నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఓపక్క ట్రిపుల్ తలాక్ పై నిషేధం విధించిన వారం కంటే తక్కువ వ్యవధిలోనే జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవటం మాటలు కాదు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి పలు విపక్షాలు ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా అద్భుతమైన రోజుగా.. భారతావనిలో నవశకం స్టార్ట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. ఇలా వేర్వేరు వాదనలు వినిపిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆర్టికల్ 370రద్దుపై మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. జరిగిన ఉదంతాన్ని జరిగింది.. జరిగినట్లుగా రిపోరర్ట్ చేస్తున్నారు. తాజా నిర్ణయం తర్వాతి పరిణామాలు ఏమిటన్న విషయంలోనూ.. ఏవైతే ఫ్యాక్టులు ఉన్నాయో వాటిని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి అనుకూల వాయిస్ వినిపిస్తున్న కొన్ని మీడియా సంస్థలు మాత్రం.. అందుకు అనుకూలంగా గళం విప్పితే.. మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు.. ఆ విషయాన్ని ఓపెన్ గా విరుచుకుపడకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు చీకటి రోజుగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహబూబా.. ఒమర్ అబ్దుల్లా లాంటి వారంతా ప్రజాస్వామ్య భారతంలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. భారత ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు.. మద్దతుదారులు మాత్రం ఇదో అద్భుతమైన రోజుగా అభివర్ణిస్తున్నారు. స్వతంత్ర భారతంలో నవశకం షురూ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. సగటు ప్రజల విషయానికి వస్తే మాత్రం.. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ ఉన్న కశ్మీర్ సమస్యలకు ఏదో ఒక కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. మోడీ ఆ దిశగా అడుగులు వేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News