ఏపీకి జైట్లీ శ‌ఠ‌గోపం పెట్టినా బాబుకు ప‌ట్ట‌దా?

Update: 2017-05-25 06:07 GMT
ఏపీ ప్ర‌జ‌ల్ని చూస్తే అయ్యో అన్న జాలి క‌ల‌గ‌క మాన‌దు. న‌మ్మి ఓట్లేసిన పాపానికి ఏపీ ప్ర‌జ‌ల‌కు అలా జ‌ర‌గ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఎంత న‌ష్టం జ‌రిగింద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. అయితే..ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకోవ‌టం అంత తేలికైన వ్య‌వ‌హారం కాన‌ప్ప‌టికీ.. క‌నీసం ధ‌ర్మంగా రావాల్సిన వాటి గురించైనా గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు కూడా క‌నిపించ‌ని దుస్థితి.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి జ‌రిగే రెవెన్యూ లోటును కేంద్రం భ‌రిస్తుంద‌న్న మాట‌ను ఇచ్చారు. అందుకు త‌గ్గ‌ట్లే కేంద్రం నుంచి అందే సాయంతో రాష్ట్రానికి ఎంతోకొంత మేలు జ‌రుగుతుంద‌ని భావించారు.అయితే.. అలాంటి మేలు సంగ‌తి త‌ర్వాత‌.. మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి.

ఓట్ల‌కు నోటు కేసు కావొచ్చు.. మ‌రింకేమైనా కావొచ్చు.. కేంద్రంతో కోట్లాడి మ‌రీ నిధులు తెచ్చుకోవాల్సిన చంద్ర‌బాబు.. త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఊరుకుండిపోవ‌టంతో.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌కు కేంద్రం పంగ‌నామాలు పెట్టేయ‌టం క‌నిపిస్తుంది. ఏపీ త‌ర‌ఫున గ‌ట్టిగా నిల‌దీసి అడిగే నాధుడు లేక‌పోవ‌టంతో కేంద్రం ఎంత చెబితే అంతన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది.

ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటుకు సంబంధించి కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ వారి లెక్క వింటే మెంట‌లెక్కిపోవ‌టం ఖాయం. వాస్త‌వానికి ఈ లోటు మొత్తాన్నిరూ.16,078 కోట్లుగా ఏపీ స‌ర్కారు చెబితే.. దాన్ని రూ.4117.89 కోట్ల‌కు కుదించేసి లెక్క‌లు చెప్పారు. ఈ మొత్తానికి లేఖ రాసిన చంద్ర‌బాబుకు తాజాగా చెప్పిన లెక్క వింటే మెంట‌లెక్కిపోవ‌ట‌మే కాదు.. ఒళ్లు మండిపోవ‌టం ఖాయం. ఎందుకంటే.. ఏపీకి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటులో ఇక ఇవ్వాల్సింది కేవ‌లం రూ.138.39 కోట్లు మాత్ర‌మేన‌ని.. ఆ మొత్తాన్ని త్వ‌ర‌లో ఇచ్చేస్తామ‌ని చెప్పేశారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో చంద్ర‌బాబు స‌ర్కారురాజీ ప‌డ‌టంతో ప్యాకేజీ స‌ర్దుబాటు చేసుకున్నారు. దీని వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగిన లాభం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. న‌ష్టం మాత్రం భారీగా  జ‌రిగింద‌న్న మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి జ‌రిగే న‌ష్టం గురించి గ‌ళం విప్పాల్సిన అధికార‌ప‌క్షం రాజీ ప‌డ‌టంతో కేంద్రం త‌న లెక్క‌ల్ని తాను చెబుతోంది. దీనిపై ఎందుకిలా? ఎలా కుదురుతుంది? లాంటి ప్ర‌శ్న‌లు లేక‌పోవ‌టంతో న‌ష్టం భారీగా ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే పాల‌కులు ఉన్న‌ప్పుడు రాష్ట్రానికి ఆ మాత్రం న‌ష్టం వాటిల్ల‌కుండా ఉంటుందా? తాజా ఎపిసోడ్ చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. వేల కోట్ల రూపాయిలు పోయిన‌ప్పుడు.. జైట్లీ మాష్టారు చెబుతున్న చిల్ల‌ర లెక్క కూడా ఎందుకు? ఆ మొత్తాన్ని కూడా కేంద్రాన్నే ఉంచేసుకోమంటే స‌రిపోతుంది క‌దా? అనిపించ‌క మాన‌దు. వేల కోట్లు పోగా లేనిది.. రూ.138 కోట్ల‌తో వ‌చ్చే భారీ మార్పు ఏముంది? మీరేమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News