వావ్‌..ట్యాక్స్‌ లు త‌గ్గుతాయంటున్న జైట్లీ

Update: 2016-12-14 12:05 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు..కొత్త నోట్ల కొర‌త‌తో తీవ్ర స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ తీపిక‌బురు అందించారు. ప‌్ర‌భుత్వం తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో దీర్ఘ‌కాలంలో ప్ర‌జ‌లపై ప‌న్నుల భారం త‌గ్గుతుంద‌ని జైట్లీ తెలిపారు. అయితే త‌న‌దైన శైలిలో ట్విస్ట్ కూడా ఇచ్చారు. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు - డిజిట‌ల్ పేమెంట్స్ ఇలాగే కొన‌సాగితే.. ఏదో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌క్ష‌ - ప‌రోక్ష ప‌న్నులు భారీగా త‌గ్గుతాయ‌ని విశ్లేషించారు. అయితే క‌చ్చితంగా ఎప్పటిలోగా ప‌న్నుల భారం త‌గ్గుతుంద‌న్న‌ది జైట్లీ చెప్ప‌లేదు.

పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అద‌న‌పు ఆదాయాన్ని వ‌చ్చింద‌నే వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌న్ను ఆదాయం భారీగా పెరిగటాన్ని దృష్టిలో ఉంచుకొని జైట్లీ ఈ వ్యాఖ్య‌లు చేశారని భావిస్తున్నారు. నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ప‌న్ను వ‌సూళ్ల‌పై ఏమాత్రం క‌నిపించ‌లేదు. ఏప్రిల్‌-న‌వంబ‌ర్ మ‌ధ్య‌కాలంలో ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వృద్ధి 15 శాతం పెర‌గ‌గా.. ఇదే కాలంలో ప‌రోక్ష ప‌న్నుల్లో 26 శాతం వృద్ధి ఉన్న‌ట్లు తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక న‌వంబ‌ర్ 30న ప్ర‌క‌టించిన‌ ఇన్‌ క‌మ్ డిక్ల‌రేష‌న్ స్కీమ్‌ తో ప‌న్ను ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

"వ్య‌వ‌స్థ‌లో న‌గ‌దు రూపంలో పెద్ద మొత్తంలో చెలామ‌ణి అవుతున్న క‌రెన్సీ మొత్తం ఇప్పుడు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చేసింది. ఇందులో ప‌న్ను క‌ట్ట‌ని లెక్క‌చూప‌ని ఆదాయానికి ఇప్పుడు ప‌న్ను వ‌సూలు చేయాల్సి ఉంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 1న కేంద్రం బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది కంటే ఈసారి సుమారు నెల ముందే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. ఇక భ‌విష్య‌త్తులో చాలా వ‌ర‌కు డిజిట‌ల్ పేమెంట్లే ఉండ‌బోతుండ‌టంతో అదంతా ప‌న్ను ఆదాయం కింద‌కే రాబోతోంది"అని జైట్లీ అన్నారు."ప్ర‌స్తుతం వ‌స్తున్న ప‌న్ను వ‌సూళ్ల‌తో పోలిస్తే భ‌విష్య‌త్తులో పెద్ద మొత్తం పెర‌గ‌నుంది. దీనివ‌ల్ల ఏదో ఒక స‌మ‌యంలో ప్ర‌త్యక్ష‌ - ప‌రోక్ష ప‌న్నుల భారాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వానికి వెసులుబాటు క‌లుగుతుంది" అని జైట్లీ చెప్పారు. ఇక నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల బ్యాంకుల్లో భారీగా డ‌బ్బు జ‌మ‌వ‌డంతో బ్యాంకుల రుణ సామ‌ర్థ్యం పెరిగింద‌ని, ఈ విధంగా ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి బ్యాంకులు త‌మ వంతు సాయం చేయ‌నున్నాయ‌ని జైట్లీ తెలిపారు. రానున్న మూడు వారాల్లో పెద్ద మొత్తంలో కొత్త క‌రెన్సీని ఆర్బీఐ బ్యాంకుల‌కు పంపిణీ చేయ‌బోతోంద‌ని, దీనివ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఇబ్బందులు కూడా తొలుగుతాయ‌ని జైట్లీ స్ప‌ష్టంచేశారు. మొత్తంగా క‌రెన్సీ క‌ష్టాల్లో ఉన్న సామాన్యుల‌కు ఇదో పెద్ద రిలీఫ్ అని భావిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News