ఏపీ ప్యాకేజీకి ఆ సీఎంలు ఓకే చేశారా?

Update: 2016-09-04 05:30 GMT
విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం డిసైడ్ కావటం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే కసరత్తు చేసిన మోడీ సర్కారు.. ఈ దిశగా తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే వీలున్న పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపుల కార్యక్రమాన్ని షురూ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన పక్షంలో తమకూ అలాంటిదే ప్రకటించాలని.. ప్యాకేజీ ప్రకటించినా.. తమ రాష్ట్రానికి ఇవ్వాలంటూ పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయని ఎన్డీయే సర్కారు భావిస్తోంది.

అందుకే.. ఏపీకి ఇవ్వాలని భావిస్తున్న ప్రత్యేక ప్యాకేజీపై ముందస్తు సంప్రదింపులు చేపట్టి.. ప్రకటన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా చూడాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చర్చలు జరిపారు. ఏపీ ప్యాకేజీ ప్రకటిస్తే.. తమకూ అలాంటివే ఇవ్వాలనే అవకాశం ఉన్న రాష్ట్రాల సీఎంలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. రానున్న రోజుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక సంఘం సిఫార్సుల్ని చూపిస్తూ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేమని స్పష్టం చేసిన జైట్లీ.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన అవసరాన్ని వివరించినట్లుగా చెబుతున్నారు. విభజన నేపథ్యంలో మారిన ఏపీ పరిస్థితిని జైట్లీ ప్రస్తావించగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఒకట్రెండు రాష్ట్రాలు తమకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీకి ఇచ్చే ప్యాకేజీపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బంగాకు చెందిన మమతా బెనర్జీ.. బీహార్ కు చెందిన నితీశ్ కుమార్ లు ఉన్నారు.

విభజన నేపథ్యంలో ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరాన్ని మమతా గుర్తు చేసి.. ఏపీని ఆదుకునే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. బీహార్ ముఖ్యమంత్రి అయితే.. తమకు ప్రకటించిన ప్యాకేజీ మాదిరి ప్రకటించకుండా.. ఏపీని ఆర్థికంగా ఆదుకునేలా ప్యాకేజీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక.. ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో అరుణ్ జైట్లీ మాట్లాడిన సందర్భంలో పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకూడదన్న అభ్యంతరాన్నివ్యక్తం చేశారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇస్తే.. తమకొచ్చే పరిశ్రమల మీద దెబ్బ పడుతుందన్న భయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏపీ ప్యాకేజీకి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చిన ఆయన.. పోలవరం విషయంలో మాత్రం సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకూ కీలక నిర్ణయం తీసుకోకూడదన్న భావనను వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్యాకేజీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రులు ప్యాకేజీపై సానుకూలంగా స్పందించటం పట్ల మోడీ అండ్ కో హుషారుగా ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News