అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు!

Update: 2016-09-07 18:50 GMT
బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సాగిన ఏపీకి ప్రత్యేక హోదా / ప్యాకేజీ హైడ్రామాకు అర్ధరాత్రి సమయంలో తెరదించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తో కలిసి మీడియాముందుకు వచ్చిన అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా లేదు, అది అడగడంలో న్యాయం ఉంది కానీ.. తాము ఇవ్వలేమని చెప్పకనే చెబుతూ.. ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీపై గడిచిన రెండున్నరేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతుండగా, బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని.. దానికి ప్రతిగా ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

అరుణ్ జైట్లీ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే ..

* విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విషయంలో హోదా కాకుండా సాయం మాత్రం చేస్తాం.

* విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ మేరకు ఆయా శాఖల మంత్రులు ప్రకటనలు చేస్తారు.

* పోలవరానికి 100% నిధులను కేంద్రమే సమకూరుస్తుంది.

* రెవెన్యూ లోటును భర్తీ చేయడంకోసం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 3979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాము.

* వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1050 కోట్లు అందజేశాము, వీటితో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాము!

* అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతి హామీ ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నెరవేరుతుంది.

* 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు.

* రైల్వే జోన్ పై సురేష్ ప్రభు ప్రకటన చేస్తారు.
Tags:    

Similar News