వైసీపీ 'అవిశ్వాసం' ఎఫెక్ట్...ఏపీపై మారిన జైట్లీ స్వరం!

Update: 2018-03-17 14:49 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని - 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప‌లు మార్లు నొక్కి వ‌క్కాణించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా - ఏపీ...ఏదో గొంతెమ్మ కోరిక‌లు కోరుతోంద‌న్న‌ట్లుగా జైట్లీ బిల్డ‌ప్ ఇచ్చారు. అయితే, ముందునుంచి `ప్ర‌త్యేక హోదా-ఆంధ్రుల హ‌క్కు` అనే నినాదంతో వైసీపీ ఏపీలో ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం, విశాఖ బీచ్ లో ప్ర‌త్యేక హోదా కోసం ఆందోళ‌న చేసేందుకు వెళ్తున్న వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ను పోలీసులు అడ్డుకోవడం వంటి ఘ‌ట‌నలు తెలిసిన‌వే. తాజాగా, దానికి తోడుగా కొద్ది రోజులుగా పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీలు నిరంత‌రాయంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డంతో పాటు - పార్ల‌మెంటు వెలుప‌ల కూడా ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌తో హోరెత్తించారు. దీనికి తోడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ నోటీసులు కూడా ఇచ్చింది. కేంద్రంపై వైసీపీ దూకుడును చూసిన‌ జైట్లీ....తాజా ప‌రిణామాల‌తో త‌న స్వ‌రాన్ని కొద్దిగా త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి అనేక జాతీయ పార్టీల నుంచి మ‌ద్ద‌తు రావ‌డంతో జైట్లీ కొద్దిగా వెనుక‌డుగు వేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీకి మ‌ద్ద‌తుగా జైట్లీ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు హాస్యాస్పందంగా ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు స‌మానంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని మ‌రోమారు జైట్లీ అన్నారు.

అయితే, ఆ ప్యాకేజీ నిధుల‌ను ఏపీకి ఏవిధంగా చేర‌వేయాలన్న దానిపై కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంంద‌ని కామెంట్ చేశారు. అపార అనుభ‌వ‌మున్న జైట్లీకి....రాష్ట్రానికి కేంద్రం నిధులు మ‌ర‌లించ‌డంపై అవ‌గాహ‌న లేద‌ని వ్యాఖ్యానించ‌డం హాస్యాస్పద‌మ‌మ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, ఆ నిధుల‌ను త‌మ‌కు వేరే విధంగా మ‌రలించాల‌ని ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌కు చెప్పింద‌ని, అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ ఆ ఊసెత్త‌లేద‌ని జైట్లీ వ్యాఖ్యానించ‌డం విడ్డూరం. తాము నిధులివ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని, తీసుకోవ‌డానికి విధివిధానాలు రూపొందించ‌డంలో ఏపీ స‌ర్కార్ జాప్యం చేసింద‌ని జైట్లీ ఆరోపించ‌డం సిగ్గుచేటు. కేవ‌లం వైసీపీ అవిశ్వాస తీర్మానానికి వ‌చ్చిన స్పంద‌ని, ఎంపీల‌ ఒత్తిడికి త‌లొగ్గిన జైట్లీ...ఇపుడు ఏపీపై బుర‌ద‌జ‌ల్లాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీ కి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీపాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీపై విశ్వ‌స‌నీయ‌త త‌గ్గుతోంద‌ని, అందుకే జైట్లీ త‌న స్వ‌రం మార్చి ఏపీతో సంధి చేసుకోవాల‌ని చూస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News