పెద్ద నోట్ల ర‌ద్దుకు రెండేళ్లు...ఇలా క‌వ‌ర్ చేశారు

Update: 2018-11-08 08:18 GMT
ఖాళీగా క‌నిపించిన ఏటీఎంలు..కిక్కిరిసిపోయిన బ్యాంకులు...తోపులాటలు..వాదోప‌వాద‌లు..న‌గ‌దు లేక తీవ్ర ఇక్క‌ట్లు...స‌రిగ్గా రెండేళ్ల కింద‌టి నిర్ణ‌యం ఫ‌లితం ఇది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి ఫ‌లితం. ఆ సంచ‌ల‌న చ‌ర్య‌కు నేటితో రెండేళ్లు పూర్తి అయ్యింది. నవంబర్ 8.. భారతీయులు మరిచిపోలేని తేదీ. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిడుగులాంటి వార్త చెప్పారు. 'పెద్ద' నోట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయానికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం నగదులో రద్దు చేసిన నోట్ల వాటా 86 శాతం. నల్ల ధనం వెలికితీతతో పాటు నగదు రహిత లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రెండేళ్లయింది.. కానీ మోడీ చెప్పినట్టు నగదు లావాదేవీలు తగ్గలేదు. ఆర్‌ బీఐ లెక్కల ప్రకారం చూస్తే.. నవంబర్‌ 4 - 2016కు దేశంలో చెలామణీలో ఉన్న నగదు రూ.17.9 లక్షల కోట్లు. అక్టోబర్‌ 26 - 2018 నాటికి ఆ మొత్తం రూ.19.6 లక్షల కోట్లకు పెరిగింది. ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేసే మొత్తం కూడా పెరిగింది. అక్టోబర్‌ 2016 నాటికి సగటున నెలకు విత్‌ డ్రా చేసే మొత్తం రూ.2.54 లక్షల కోట్లుండగా.. ఆగస్టు 2018 నాటికి  ఆ మొత్తం రూ.2.75 లక్షల కోట్లకు పెరిగింది. 2016 డిసెంబర్ లో విత్‌ డ్రాల మొత్తం రూ.1.06 కోట్లకు పడిపోయింది. ఇక.. మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు కూడా పెరిగాయి. అక్టోబర్‌ 2016లో రూ.1.13 లక్షల కోట్లున్న మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు.. ఆగస్టు 2018కి రూ.2.06 కోట్లకు చేరింది.

కాగా,  నోట్ల ర‌ద్దుకు రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త‌న ఫేస్‌ బుక్‌ లో ఆ అంశంపై స్పందించారు. డ‌బ్బును స్వాధీనం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను చేప‌ట్ట‌లేద‌న్నారు. కానీ అక్ర‌మంగా దాచుకున్న సొమ్మును ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో డిమానిటైజేష‌న్ చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. నోట్ల ర‌ద్దును ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుప‌డుతున్న స‌మ‌యంలో.. మోడీ చ‌ర్య‌ను జైట్లీ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెట్టేందుకు తీసుకున్న నిర్ణ‌యాల్లో డిమానిటైజేష‌న్ ఒక‌టి అని జైట్లీ అన్నారు. దేశం బ‌య‌ట ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని - జ‌రిమానా ప‌న్ను క‌ట్టి - ఆ సొమ్మును తీసుకువ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురాని వారిపైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. విదేశాల్లో అకౌంట్లు ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు. అక్ర‌మంగా నిలువ చేసుకున్న డ‌బ్బును.. నోట్ల ర‌ద్దు చ‌ర్య‌తో బ్యాంకుల‌కు వ‌చ్చే విధంగా చేశామ‌న్నారు. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల సుమారు 17.42 ల‌క్ష అక్ర‌మ అకౌంట్ల‌ను గుర్తించామ‌న్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి - ప‌న్ను ఎగ‌వేసిన వారిని శిక్షించామ‌న్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెర‌గ‌డం వ‌ల్ల‌, ఇప్పుడా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయ‌న్నారు. చాలావ‌ర‌కు అక్ర‌మ డ‌బ్బు ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్స్ రూపంలో పెట్టుబ‌డిగా పెట్టార‌న్నారు. దీంతో ఆ సొమ్ము మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చేసింద‌ని మంత్రి జైట్లీ అన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌ర్స‌న‌ల్ ఇన్‌ కం ట్యాక్స్ రాబ‌డి పెరిగింద‌న్నారు.



Tags:    

Similar News