వార్నీ... కేజ్రీవాల్ ని చికాకు పెట్టిన చీపురు

Update: 2020-01-20 17:04 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నామినేషన్ కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు - అభిమానులతో అట్టహాసంగా వెళ్ళగా.. ఈ రోడ్డు షో కారణంగా ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ చేదు అనుభవం కూడా ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు ఎదురైంది.

కేజ్రీవాల్ ఈ రోజు (జనవరి 20) తన భార్య సునితా కేజ్రీవాల్ - పిల్లలతో కలిసి ఓపెన్ టాప్ జీపులో నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం గం.3 లోపు నామినేషన్ దాఖలు చేయాలి. కానీ భారీ కార్యకర్తలు తరలి రావడం, - వారు చీపుర్లతో హంగామా చేయడంతో నామినేషన్ ఆలస్యమైంది. ఆయన మధ్యాహ్నం తన ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరారు. కానీ అభిమానులు పోటెత్తడంతో అనుకున్న సమయానికి ఎలక్షన్ ఆఫీసర్ వద్ద నామినేషన్ దాఖలు చేయలేకపోయారు.

తాను మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్ దాఖలు చేయాలని, కానీ రోడ్డు షో వల్ల కుదరలేదని, రేపు (జనవరి 21) ఉదయం కుటుంబ సభ్యులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే తనకు కొంతమంది సమయం మించిపోతుందని గుర్తు చేశారని, కానీ ఇంత పెద్ద మొత్తంలో తరలి వచ్చిన వారిని కాదని ఎలా వెళ్లగలనని చెప్పినట్లు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్డు షో వాల్మీకీ ఆలయం వద్ద ప్రారంభమైంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. 2013లో క్లియర్ మెజార్టీ రాలేదు. 49 రోజుల తర్వాత ఆయన రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. బీజేపీకి మూడు రాగా, కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది.
Tags:    

Similar News