​కేజ్రీవాల్ ఎంత పెద్ద తప్పు చేశాడంటే 1

Update: 2015-12-06 04:52 GMT
పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇదే. ఒకడేదో చేశాడని..దాన్ని గుడ్డిగా ఫాలో కావటమే కానీ.. బుర్ర పెట్టి లాజిక్ గా ఆలోచించటం అన్నది ఉండదా? అన్న ప్రశ్నలు ఇప్పుడు మదిలో మెదులుతున్నాయి. సామాన్యుడ్ని.. సామాన్యుడ్ని అంటూ రాజకీయాల్లో వచ్చేసి.. పీకేస్తా అంటూ గొప్పలు చెప్పి.. చివరకు సామాన్యలు ఉసురే తీస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.

కాలుష్యాన్ని తగ్గించటం కోసం చర్యలు తీసుకోవాల్సి వచ్చేసరికి.. అయ్యగారికి మదిలో మెరిసిన మెరుపులాంటి ఐడియా ఏమిటంటే.. వాహనానికి చివరల్లో ఉన్న నెంబర్లలో సరి సంఖ్యకు ఒక రోజు.. బేసి సంఖ్యకు మరో రోజు మాత్రమే రోడ్డు మీదకు ఎక్కే చిత్రమైన రూల్ ఒకటి తెరపైకి తెచ్చారు. బీజింగ్ లో అమలు చేసిన దాన్ని భారత్ లో అమలు చేయాలన్నఅద్భుతమైన ఆలోచన కేజ్రీవాల్ కి రావటం.. దాన్ని అమలు చేయటం చేస్తున్నారు.

కేజ్రీవాల్ కు వచ్చిన ఈ దరిద్రపు ఆలోచనను.. తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. అంతకు మించిన పిచ్చి ఆలోచన మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఇలాంటి నిర్ణయం కానీ తీసుకుంటే.. కాలుష్యం తగ్గింపు సంగతి తర్వాత.. పెరగటం ఖాయం. ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఈ వ్యవహారంలో వర్క్ వుట్ అయ్యే అంశాల కంటే కూడా వర్క్ వుట్ కానివే ఎక్కువ.

దూరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్ని ఆలోచిస్తేనే.. ఈ విధానంలో ఉండే లోపాలు కుప్పలు కుప్పలు బయటపడతాయి. కారు అన్నది విలాస వస్తువు కాకుండా.. అదో అవసరంగా ఎందుకు మారిందన్న సాధారణ ప్రశ్నలోనే చాలా సమాధానాలు లభిస్తాయి. మహా నగరాల కాన్సెప్ట్ పుణ్యమా అని ఎవరు ఎంతెంత దూరాల్లో ఉంటారో తెలీదు. ఎవరు ఎక్కడున్నా.. కారు.. బైకులాంటి వాహన సౌకర్యంతో.. దూరాభారాల్ని అధిగమించే అవకాశం ఉంది. కారు ఒక అవసరంగా మారటానికి కారణం నగర శివారులో నివాసాలు పెరగటం. పని చేసే ప్రాంతానికి కనిష్ఠంగా 10 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఇప్పుడో అలవాటుగా మారింది.

పని చేసే చోటకు.. ఉండే  నివాసానికి మధ్య దూరం పెరిగే కొద్దీ.. వాహన అవసరం ఎక్కువ అవుతుంది. నగరాల్లో పెరిగే ట్రాఫిక్ కు కారులో అయితే.. కాస్త ఆలస్యమైనా.. చికాకులు ఉండవన్న ఉద్దేశంతో ఆ సౌకర్యం మీద దృష్టి పడుతోంది. ఆఫీసుకు వెళ్లే విషయాన్ని పక్కన పెడితే.. ఆసుపత్రి మొదలు షాపింగ్ వరకూ భార్య.. పిల్లలతో బయటకు వెళ్లానుకునే వారికి కారుకు మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. ఎండ.. వాన.. చలి లాంటి వాతావరణాల్లో ఇబ్బంది లేకుండా ప్రయాణం కారుతోనే. అన్నింటికి మించి కాస్త దూరం ఆలోచిస్తే.. రోడ్డు మీద ప్రమాదం ఏదైనా జరిగితే బైకుతో పోలిస్తే.. కారుతో జరిగే నష్టం చాలా తక్కువ. ఈ వాదనను వెంటనే ఒప్పుకోకపోవచ్చు కానీ.. ఇది నిజం.

ఇక.. అన్నింటికి మించి.. ఏదైనా అత్యవసరం అయి.. వేళ కాని వేళలో ఆసుపత్రికి పరుగులు తీయాలంటే కారుకు మించింది మరొకటి ఉండదు. ఇలాంటి సమయాల్లో సరి.. బేసి రోజుల్ని చూసుకొని కారు వాడాలన్న నిర్ణయంతో లాభం కంటే నష్టమే ఎక్కువ. కాలుష్యానికి చెక్ చెప్పేందుకు ఇంతకు మించిన మంచి ఆలోచన మరొకటి ఉండదా? అన్న సందేహం కలగక మానదు.

ఎక్కడిదాకో ఎందుకు.. ఊరి నుంచి పెద్దవాళ్లు వస్తుంటారు. అదే రోజు.. మీ కారు తీయాల్సిన రోజు కాకపోతే ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది? కారు కొనే చాలామంది ఎగువ మధ్యతరగతి వారు.. నగరంలో ఎదురయ్యే అసౌకర్యాలు అధిగమించటానికి. అలాంటిది ఈ కారు రేషన్ కారణంగా చికాకులే ఎక్కువ. ఏదైనా వేడుక.. లేదంటే సినిమా.. లేదంటే ఆపీసులో ఫార్టీ.. కార్యక్రమం ఏదైనా సరే.. రాత్రిళ్లు వెళ్లి రావాలంటే ఎంత చికాకు. ఇంట్లో కారు ఉంచుకొని రేషన్ పుణ్యమా అని వాడలేని దుస్థితి కడుపు మండంచక మానదు. తన సెలవు రోజున తాను కారు వాడే అవకాశం లేకపోతే.. షాపింగ్ దగ్గర నుంచి.. బయటకు వెళ్లే కార్యక్రమాల మాటేమిటి?
Tags:    

Similar News