ఎన్నార్సీ మంటలు..బీజేపీకి కేజ్రీ షాకిచ్చేశారు!

Update: 2019-09-25 15:30 GMT
నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్స్... ఎన్నార్సీగా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన భారత పౌరుల గుర్తింపు కార్యక్రమానికి అడుగడుగునా ఆటంకాలు తప్పడం లేదు. అసోంలో ఇప్పటికే ఎన్నార్సీపై పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాలను బేరీజు వేసుకున్న చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎన్నార్సీని జరగనివ్వబోమని తేల్చి పారేశాయి. ఈ తరహా నిరసనలు వ్యక్తం చేయడంలో తొలుత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు షాకిచ్చారు. తమ రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి పారేశారు. ఆ తర్వాత బీజేపీకే కాకుండా దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోనూ ఎన్నార్సీ అమలుపై ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నిరసన గళం వినిపించారు. తాజాగా ఈ జాబితాలోకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నార్సీని అమలు చేయనివ్వబోమని సంచలన ప్రకటన చేసిన కేజ్రీ... ఒకవేళ తమ వాదనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎన్నార్సీ అమలు జరిగితే... తొలుత ఢిల్లీ వీడి వెళ్లేది బీజేపీకి చెందిన ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీనేని కూడా కేజ్రీ బీజేపికి డేంజర్ బెల్స్ వినిపించారు. దేశంలో భారత పౌరసత్వం లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడంతో పాటుగా వారిని వారి దేశాలకు తరలించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ఎన్నార్సీని అమలు చేస్తున్నారన్నది తెలిసిందే కదా. అలా ఢిల్లీలో స్థానిక పౌరసత్వం లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి, బయటకు పంపే కార్యక్రమం మొదలెడితే... తొలుత బహిష్కరణ వేటు పడేది బీజేపీకి చెండిన ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీనేని కేజ్రీ వాదిస్తున్నారు. మరి ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తివారీని బహిష్కరించే ఎన్నార్సీని బీజేపీ ఢిల్లీలో అమలు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది.

కేజ్రీ మాదిరే యూపీ మాజీ సీఎం - సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఇదే వాదనను గతంలో వినిపించారు. యూపీలో ఎన్నార్సీని అమలు చేయనివ్వబోమని ప్రకటించిన అఖిలేశ్... తమ అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్రంలో ఎన్నార్సీ అమలు జరిగితే... తొలుత రాష్ట్రాన్ని వీడి వెళ్లాల్సిన వ్యక్తి సీఎం హోదాలో ఉన్న యోగి ఆదిత్యనాథేనని కూడా అఖిలేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. యూపీలో నాన్ లోకల్ గా ఉంటున్న యోగి... ఎన్నార్సీ గనుక అమలు జరిగితే... ఆయనే అందరికంటే ముందుగా యూపీని వదిలి వెళ్లాల్సి వస్తుందన్నది అఖిలేశ్ వాదన. అఖిలేశ్ వాదన మాదిరే ఇప్పుడు కేజ్రీ కూడా బీజేపీ కీలక నేతలనే టార్గెట్ చేస్తూ ఎన్నార్సీపై నిరసన గళం విప్పడంతో దేశ రాజధానిలో అసలు ఎన్నార్సీ అమలు జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News