లొల్లి చేస్తూనే మోడీని హెల్ప్ కోరిన కేజ్రీవాల్

Update: 2015-12-22 05:37 GMT
ఓపక్క కేంద్రంపై ఒంటికాలి మీద దుముకుతున్న కేజ్రీవాల్ సర్కారు.. మరోవైపు పెద్దన్న లాంటి కేంద్రం నుంచి తనకు కావాల్సిన సాయాన్ని కోరటానికి ఏమాత్రం మొహమాటపడటం లేదు. రాజకీయ వైరం వ్యక్తిగత.. వృత్తిగత అంశాల మీద పడే ప్రస్తుత కాలంలో అందుకు భిన్నంగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుపై విరుచుకుపడటం.. సర్కారులోని కీలకమైన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మీద అవినీతి ఆరోపణలు చేస్తూనే.. మరోవైపు మోడీ సర్కారు నుంచి తనకు అవసరమైన సాయాన్ని అడుగుతున్నారు.

తాజాగా.. అలాంటి సాయమే ఒకటి కేంద్రాన్ని కోరారు కేజ్రీవాల్. జనవరి ఒకటి నుంచి ఢిల్లీ మహా నగరంలో కాలుష్య నివారణలో భాగంగా వాహనాల విషయంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మంత్రులు.. ప్రధానకార్యదర్శులు.. ఇతర ఉన్నతాధికారులంతా ఢిల్లీ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. వాహన చివరి అంకెలు సరి.. బేసి ఆధారంగా ఢిల్లీ రోడ్ల మీద అనుమతించాలన్న విధానాన్ని అమలు చేసేలా మోడీ సాయాన్ని కేజ్రీవాల్ కోరారు. రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే.. పాలనా పరంగా కేంద్రం నుంచి సాయం కోరుతున్న కేజ్రీవాల్ తెలివితేటల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News