నీతి ఆయోగ్‌ కు ప‌న‌గ‌రియా రిజైన్‌!

Update: 2017-08-01 11:49 GMT
అర‌వింద్ ప‌న‌గ‌రియా... న‌రేంద్ర మోదీ భార‌త ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత దేశ‌మంత‌టా భారీగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన పేరు. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు చీఫ్ ఎకాన‌మిస్ట్‌గానే కాకుండా ప్ర‌పంచ ఆర్థిక సంస్థ (వ‌ర‌ల్డ్ బ్యాంకు), అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ల‌లో కీల‌క పోస్టుల్లో ప‌నిచేసిన ప‌న‌గ‌రియాకు ప్ర‌పంచ దేశాల‌న్నింటిలో పేరెన్నిక‌గ‌న్న ఆర్థిక వేత్త‌గా పేరుంది. న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మ‌యంలో కొలంబియా యూనివ‌ర్సిటీలో ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న ప‌న‌గ‌రియా... మోదీ కేబినెట్ లో కీల‌క బాధ్య‌త‌లు వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చారం సాగింది.

ఒకానొక స‌మ‌యంలో ప‌న‌గ‌రియాను ఆర్థిక మంత్రిగా చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే బీజేపీలో ఆర్థిక శాస్త్రం చ‌దివిన నేత‌లు చాలా మందే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలా మ‌న్మోహ‌న్ సింగ్‌ను ఉన్న‌ప‌ళంగా ఆర్థిక మంత్రిగా చేయాల్సిన దుస్థితి త‌మ‌కు లేద‌న్న వాద‌న కూడా బీజేపీ నేత‌ల్లో వ్య‌క్త‌మైంది. ప‌న‌గ‌రియాపై మంచి అంచ‌నాలే ఉన్న మోదీ...  ఆయ‌న‌కు కేంద్ర ఆర్థిక మంత్రి ప‌ద‌వి అయితే ఇవ్వ‌లేదు గానీ... దానికి స‌రిస‌మానంగా ఉండే... ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేశారు. అయినా ప్ర‌ణాళికా సంఘం ఇంకెక్క‌డుంద‌నేగా మీ ప్ర‌శ్న‌?  నిజ‌మే... ప్ర‌ణాళికా సంఘం లేదు గానీ, దాని బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు మోదీ స‌ర్కారు నీతి ఆయోగ్ పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప‌న‌గ‌రియాను వైస్ చైర్మ‌న్ గా నియ‌మిస్తూ మోదీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మోదీ అంచ‌నాల‌కు అనుగుణంగానే ప‌నిచేసిన ప‌న‌గ‌రియా... దేశంలో ప‌లు కీల‌క సంస్క‌ర‌ణ‌ల వెనుక ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇంకా ఆయ‌న పోషించాల్సిన పాత్ర చాలానే ఉన్న‌ప్ప‌టికీ... మోదీకి షాకిస్తూ ఆయ‌న కాసేప‌టి క్రితం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కిష్ట‌మైన బోధ‌నా వృత్తిలోకి వెళ్లేందుకే తాను నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప‌న‌గ‌రియా ప్ర‌కటించారు. ఈ నెలాఖ‌రు దాకా నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతాన‌ని, ఆ త‌ర్వాత తాను కొలంబియా వ‌ర్సిటీకి వెళ్లిపోతాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. మ‌రి ఊహించ‌ని ప‌రిణామంలా ఉన్న ప‌న‌గ‌రియా నిర్ణ‌యంపై మోదీ స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News