నీ భార్య‌తో సంసారం చేసి తలాక్‌ పై మాట్లాడు మోడీ

Update: 2017-12-14 07:15 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై మ‌రోమారు ఎంఐఎం అధ్యక్షుడు - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుప‌డ్డారు. కేంద్రం రూపొందించిన త‌లాక్‌ పై స్పందిస్తూ ప్ర‌ధాని వ్య‌క్తిగ‌త జీవితంపై తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండులో ముస్ల్లిం లాబోర్డు సభ్యులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లింల చట్టంలో వేలుపెడితే సహించేది లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం ఏ ప్రాతిపదికన త్రిపుల్ తలాక్ చట్టాన్ని రూపొందిస్తుందో తెలపాలని ఓవైసీ డిమాండ్ చేశారు. పర్సనల్ లాలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రధానమంత్రిగా తన భార్యకే న్యాయం చేయలేనివాడు ముస్లిం యువతులకు న్యాయం చేస్తానంటూ రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారని అస‌దుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. మొదట తన భార్యతో కలిసి కాపురం చేసి త్రిపుల్ తలాక్‌ పై మాట్లాడాలని హితవు పలికారు. త్రిపుల్ తలాక్ పేరుమీద ప్రభుత్వం మూడు సంవత్సరాలు జైలుశిక్ష వేస్తే వారి కుటుంబానికి ఆసరా ఎవరని - దీనికి ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు. దేశంలో అండర్ ట్రయిల్ ఖైదీలుగా ఎంతోమంది ముస్లిం యువకులు ఉన్నారని - వీరిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

దేశంలో ముస్లిం యువతకు ఉపాధి - ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించడం లేదని - అనవసర విషయాలను పెద్దగా చేస్తుందని ఓవైసీ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ మొసలి కన్నీరు కారుస్తూ ముస్లింలను ఎంతో అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ముస్లింల కోసం గ‌ళం విప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు జరిగే ముస్లిం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
Tags:    

Similar News