ప్ర‌ధాన‌మంత్రి భూమిపూజ‌కు వెళ్తే రాజ్యాంగ ఉల్లంఘ‌నే

Update: 2020-07-28 13:00 GMT
కాషాయం పేరు మీద ఎదిగిన బీజేపీ ఎట్ట‌కేల‌కు త‌న దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం పూర్తి చేసుకోనుంది. మొద‌టి నుంచి రాజ‌కీయాల‌కు పావుగా వాడుకుంటున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆ కార్య‌క్ర‌మానికి ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే అయోధ్య ప‌ర్య‌ట‌న‌పై ప్రధానమంత్రి కార్యాలయం సైతం షెడ్యూల్ ను ప్రకటించింది. ప్ర‌ధాని అయోధ్య పర్యటనపై తాజాగా ర‌చ్చ జ‌రుగుతోంది. లౌకిక దేశానికి ప్ర‌ధానిగా ఉన్న వ్య‌క్తి.. ఒక మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డంపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబ‌ట్టారు.

అయోధ్య భూమిపూజ కార్యక్రమానికి అధికారిక హోదాలో ప్రధానమంత్రి హాజరైతే అది రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రధాని పదవి చేపట్టేటప్పుడు చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టేనని ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం ఆయ‌న‌ ట్వీట్ చేశారు. లౌకికవాదం భారత రాజ్యాంగానికి ప్రాథమిక పునాది అని గుర్తుచేశారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్తుల సమూహం 1992లో కూల్చివేసిన సంఘటనను తాము మర్చిపోలేమని ట్వీట్ లో పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి అయోధ్య ప‌ర్య‌ట‌న‌పై ఈ విధంగా ఎంఐఎం వ్య‌తిరేకిస్తుండ‌గా మ‌రికొన్ని పార్టీలు.. సంస్థ‌లు కూడా ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పుబ‌డుతున్నాయి. ఒక లౌకిక దేశానికి రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి హాజ‌రుకావ‌డం రాజ్యాంగ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిపై వివాదం న‌డుస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News