పెట్ షాప్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వందలాది జంతువులు మృత్యువాత
అమెరికాలోని ఓ పెట్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫలితంగా వందలాది జంతువులు మృత్యువాతపడ్డాయి.
అమెరికాలోని ఓ పెట్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫలితంగా వందలాది జంతువులు మృత్యువాతపడ్డాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తు అగ్నిప్రమాదం సంభవించింది. కాగా.. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో 500కుపైగా జంతువులు మృత్యువాత చెందినట్లు తెలుస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో వందలాది పక్షులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అమెరికా దేశంలోనే టెక్సాస్ పరిధి డల్లాస్‌లో గడిచిన కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఒక పెట్ షాప్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో ఈ షాపులో సుమారు 1,000 వరకు వివిధ రకాల పెట్స్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ఇక్కడకు వచ్చి తమకు కావాల్సిన జంతువులను, పక్షులను కొనుగోలు చేసి తీసుకు వెళుతుంటారు. అయితే.. శనివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా ఈ దుకాణంలో మంటలు వ్యాప్తిచెందాయి.
ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పెట్ షాప్‌లో ఉన్న జంతువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఘటన విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అక్కడికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే వందలాది మూగజీవాలు ప్రాణాలను కోల్పోయాయి. ఈ ప్రమాదంలో ప్రాథమిక అంచనా ప్రకారం 579 మూగజీవాలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే.. మృతిచెందిన వాటిలో దాదాపు 60 శాతానికి పైగా పక్షులే ఉన్నట్లు చెబుతున్నారు. కుక్కలు, కుందేలు, నెమళ్లు, పావురాళ్లు వంటి ఇతరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సువిశాలమైన భవనంలో ఉన్న ఈ పెట్ షాప్‌లో అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది..? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకేదైనా కారణం ఉందా అన్నదానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.