అమెరికాలో జెండా అవనతంపై ట్రంప్ కీలక ట్వీట్
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో 30 రోజులపాటు జాతీయ జెండాను అవనతం చేయాలని నిర్ణయించారు.
ఏ దేశంలో అయినా ప్రముఖులు లేదంటే ఆ దేశానికి సేవలందించిన వారు చనిపోతే సంతాప దినాలు పాటించడం కామన్. పార్టీలతో సంబంధం లేకుండా ఆ మాత్రం గౌరవం ఇవ్వడం సాధారణం. అది వారం రోజులు కావచ్చు.. పది రోజులు కావచ్చు సంతాప దినాలుగా పాటిస్తుంటారు. ఆ సమయంలో తమ దేశ జాతీయ జెండాలను అవనతం చేస్తుంటారు.
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో 30 రోజులపాటు జాతీయ జెండాను అవనతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. అయితే..ఈ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అంతేకాకుండా ఈ నిర్ణయంపై అమెరికన్లు అంత సంతోషంగా లేరని కామెంట్స్ చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ పోస్ట్ చేశారు.
తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే క్రమంలో జాతీయ జెండాను అవనతం చేశారని, ఇది చాలా గొప్ప విషయంగా వారు భావిస్తున్నారని బైడెన్‌ను ఉద్దేశించి ట్రంప్ అభిప్రాయడపడ్డారు. వాస్తవంగా వారికి దేశం అంటే ప్రేమ లేదని, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణం కారణంగా కాబోయే అధ్యక్షుడి శకం ప్రారంభానికి జెండా అవనతమై ఉండడం బహుశా ఇది మొదటిసారి కావచ్చని తెలిపారు. ఎవరూ దీనిని చూడాలని కోరుకోరని.. కానీ తనకు ఈ కొత్త అనుభవం ఎదురైందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై అటు అమెరికా ప్రజలు కూడా సంతోషంగా లేరని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ట్రంప్ కామెంట్స్‌పై వైట్‌హౌస్ ప్రతినిధి కరీన్ జిన్ పియర్ స్పందించారు. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ఆలోచన అస్సలు లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. జనవరి 20న ట్రంప్ అధికారిక బాధ్యతలు స్వీకరించనున్నారు.