కాళేశ్వ‌రం సీక్రెట్ చెప్పిన కేంద్ర‌మంత్రి!

Update: 2019-07-12 05:11 GMT
తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయినిగా కీర్తించే కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు కేంద్ర‌మంత్రి. మొన్నీమ‌ధ్య‌నే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి అయినంత హ‌డావుడి చేస్తూ.. ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌ట‌మే కాదు.. రెండు రాష్ట్రాల నుంచి ముఖ్య‌మంత్రుల‌ను పిల‌వ‌టం..పూజ‌లు.. పున‌స్కారాల‌తో చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.

మొన్న‌టి కేసీఆర్ హ‌డావుడి చూస్తే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు దాదాపుగా పూర్తి అయ్యింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కీల‌క‌మైన పంప్ హౌస్ ల ద‌గ్గ‌ర ప్రాంభోత్స‌వాల్ని నిర్వ‌హించ‌టం.. దీనికి తోడు కాళేశ్వ‌రం నీళ్లు పారే ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌టం తెలిసిందే. ఇంత భారీగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ప్పుడు మీడియా ప్ర‌తినిధుల‌ను ఎక్క‌డా అనుమ‌తించ‌క‌పోవ‌టం.. త‌మ కెమేరాల‌తో చిత్రీక‌రించిన స‌న్నివేశాల్ని తీసుకోవాల‌న్న ఫ‌ర్మానా జారీ చేయ‌టం తెలిసిందే.

ఎందుకిలా? అన్న సందేహానికి సంతృప్తిక‌ర స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. తాజాగా ఆ లోటు తీర్చేలా కేంద్ర‌మంత్రి స‌మాధానం వ‌చ్చింద‌ని చెప్పాలి. కాళేశ్వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌టానికి మ‌రో రూ.30వేల కోట్ల ఖ‌ర్చు అవుతుంద‌ని పేర్కొన్న కేంద్ర‌మంత్రి మాట‌ల్ని విన్న‌ప్పుడు.. మొత్తం పూర్తి అయ్యాక చేయాల్సిన హ‌డావుడిని ఇంత ముందే ఎందుకు చేసిన‌ట్లు? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింద‌ని చెప్పాలి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ ప్ర‌శ్న‌ను అడిగింది ఎవరో కాదు కేసీఆర్ జిగిరీ దోస్త్ మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి కావ‌టానికి ఎంత మేర నిధులు ఇంకా అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అడ‌గ్గా.. రూ.30వేల కోట్ల భారీ మొత్తం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. 2019 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు కోసం రూ.50,481 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. అంటే స‌గం పూర్తి అయిన ప్రాజెక్టుకే ఇంత హ‌డావుడి చేసిన కేసీఆర్.. మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తే మ‌రెలా వ్య‌వ‌హ‌రిస్తారో?
Tags:    

Similar News