ప్ర‌త్యేక హోదా కోసం కొత్త గ‌ళం

Update: 2016-08-30 09:27 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశం మ‌రోమారు రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల‌ను తెర‌మీద‌కు తెస్తోంది. స్పెష‌ల్ స్టేట‌స్‌ పై కేంద్రం వెన‌క్కు తగ్గిన‌ట్లు క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఆయా వ‌ర్గాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి.ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌కీయ పార్టీలు - విద్యార్థులు రోడ్డెక్క‌గా తాజాగా ఉద్యోగ సంఘాలు  గ‌ళం వినిపిస్తున్నాయి. ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ బాబు ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి - ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ త‌ర‌ఫున ప‌లు సూచ‌న‌లు చేశారు. అంతేకాదు ఏకంగా నాయ‌కులు విఫ‌లం అయితే తామేం చేస్తామో ప్ర‌క‌టించేశారు.

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్నివర్గాల వారిని, అధికారులను - ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు కేవలం ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ మిగ‌తా హామీల‌ను సైతం కేంద్ర ప్ర‌భుత్వం నిల‌బెట్టుకోవాల‌ని అశోక్‌ బాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం అవసరమైన నిధులు - లోటు బడ్జెట్ భర్తీ - వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి సహాయాలు కూడా కేంద్రం చేయాలని స్ప‌ష్టం చేశారు.  ప్రత్యేక హోదా అంశం రాజకీయ వ్యవస్థకు సంబంధించిందని, అందుకనే రాష్ట్రంలోని ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు అందరూ కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.  అందరితో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అశోక్ బాబు చెప్పారు.రాజకీయ బలం చాలని పక్షంలో తాము కూడా హోదా కోసం రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. అయితే తాము రోడ్లపైకి వస్తే రాష్ట్రం మరింతగా నష్టపోతుందని, అందుకని తప్పనిసరైతేనే పోరాడతామన్నారు. రాజకీయ వ్యవస్థ జీరో అయినప్పుడు తాము రంగంలోకి దిగుతామని అశోక్‌ బాబు తెలిపారు. ఆర్థిక విధానాలపై సెప్టెంబర్ 2న ఉద్యోగులు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెకు ఏపీ జాక్ పూర్తి మద్దతు ఇస్తుందని అశోక్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ - ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సెప్టెంబర్ 28 - 29 తేదీల్లో మండల స్థాయిలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు అశోక్‌ బాబు ప్రకటించారు.
Tags:    

Similar News