చంద్ర‌బాబుతో ఈ బాబు లాలూచీ ప‌డ‌లేద‌ట‌

Update: 2017-02-03 05:23 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎలా చెపితే అలా వ్య‌వ‌హ‌రిస్తూ ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ పెద్ద ఎత్తున వ‌స్తున్న విమ‌ర్శ‌లపై ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు ఎట్ట‌కేల‌కు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై తాను ప్రభుత్వంతో లాలూచీపడి వ్యవహరిస్తున్నట్టు కొందరు ఉద్యోగ సంఘాల నేతల్లో భావించ‌డం వ‌ట్టి అపోహ అని పేర్కొన్నారు. అలాంటి అభిప్రాయాన్ని  తొలగించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అపుడు అస‌లు నిజం తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను నిజాయితీగా, చిత్త‌శుద్ధితో కృషిచేస్తున్నాన‌ని అశోక్ బాబు ఈ సంద‌ర్భంగా తెలిపారు. త్వరలో జరిగే ఏపీ ఎన్టీజో సంఘం రాష్ట్ర ఎన్నికలు లాంఛనప్రాయమేనన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డిమాండ్ల పరిష్కారంలో కొంతమేర జాప్యం జరుగుతుందని, కొందరి నేతలకు నచ్చక ప్రభుత్వంతో తాను క‌లిసిపోయిన‌ట్లు ప్రచారం చేస్తున్నారని అశోక్ బాబు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి ఉన్న రెండు విడతల డిఎను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారన్నారు. ఏపీ ఎన్‌ జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి ఓటర్ల జాబితాను ఆమోదించినట్లు ప్రకటించారు. ఈనెల 19వ తేదీన జరగనున్న రాష్ట్ర సంఘ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 12వ తేదీ ఉదయం ఎన్నికల అధికారికి తమ ప్యానల్‌ కు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు అశోక్ బాబు తెలిపారు. 19వ తేదీన జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు పశ్చిమ కృష్ణా - హైదరాబాద్ యూనిట్‌ లతో కలిపి మొత్తం 809 మంది ఓటర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారన్నారు. ఎన్‌ జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి గతంలో మాదిరిగానే ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ సంఘంలో ఎటువంటి చీలికలు లేవని అశోక్ బాబు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News