అశోక్ బాబు వెళ్లిపోతే మంచిదంటున్నారు!

Update: 2018-08-20 05:28 GMT
ఉద్యోగ సంఘాల నేత‌గా ఉన్న‌ప్పుడు ఉద్యోగుల హ‌క్కులు.. వారి స‌మ‌స్య‌ల మీద పోరాడాలి. కానీ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ని చేయ‌కూడ‌దు. కానీ.. ఏపీ ఎన్జీవో సంఘం అధినేత అశోక్ బాబు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ స‌ర్కారుతో చెట్టాప‌ట్టాలు వేసుకొని న‌డుస్తున్న వైనంపై సంఘ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ప్ర‌భుత్వంతో ల‌బ్థి పొందాల‌న్న భావ‌న అశోక్ బాబులో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న మాట‌ను చెబుతున్నారు. ఇప్ప‌టికే వాలంట‌రీ రిటైర్మెంట్ కోసం అప్లికేష‌న్ పెట్టుకున్న ఆయ‌న‌.. ఉద్యోగం నుంచి బ‌య‌ట‌కు రాగానే ప‌ద‌వి ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అశోక్ బాబు కోసం ఏపీఎండీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో పాటు.. మార్చిలో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య‌వాడ‌లోని ఎన్టీవో భ‌వ‌న్ లో ఒక స‌మావేశం జ‌రిగింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం శ‌నివారం అర్థ‌రాత్రి జ‌రిగిన ఈ మీటింగ్ లో అశోక్ బాబుకు ఊహించ‌ని షాకులు త‌గిలిన‌ట్లుగా చెబుతున్నారు. అధ్య‌క్షుడి ఎంపిక‌కు సంబంధించిన అభిప్రాయాన్ని.. సంత‌కాలు చేసిన కాపీని అశోక్ బాబుకు అందించారు.

దీంతో చిన్న‌బోయిన అశోక్ బాబు.. త‌న‌ను ఎప్పుడు వెళ్లిపొమ్మంటారంటూ ప్ర‌శ్నించ‌గా.. సంఘ స‌భ్యులు సూటిగా స‌మాధానం చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మీరు ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ వ్య‌క్తిగా ముద్ర వేసుకున్నార‌ని.. మీరు ఎంత త్వ‌ర‌గా వెళితే అంత మంచిద‌ని.. ఏపీ ఎన్జీవో ఏ పార్టీతోనూ సంబంధం లేద‌న్న మాట‌ను మీడియాతో కూడా చెప్పాల‌న్న ఒత్తిడిని అశోక్ బాబుపై తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే ప‌లువురు స‌భ్యులు అశోక్ బాబు అంటేనే తెలుగుదేశం పార్టీ వ్య‌క్తిగా భావిస్తున్నార‌ని.. అందుకే.. అసోసియేష‌న్ నుంచి ఎంత త్వ‌ర‌గా వెళ్లిపోతే అంత మంచిదంటూ ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. త‌న తోటి స‌భ్యుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ఆయ‌న స్పందిస్తూ.. త్వ‌ర‌లోనే సీఎంను క‌లిసి ఆయ‌న‌తో చ‌ర్చించి నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News