అంత ప్రేమ అయితే ఇంత లొల్లి ఏల అశోక్ బాబు?

Update: 2016-06-08 14:19 GMT
రాష్ట్ర విభజనకు కారణమైన ముఖ్యమైన మూడు ఇష్యూల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఒకరన్న విషయం ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా నిజం. దీన్ని ఎవరూ కొట్టి పారేయలేదు. ఈ రోజు సీమాంధ్రులు పడుతున్న కష్టాలకు కేసీఆర్ అండ్ కో ఎంత కారణమో.. వారిని ప్రేరేపించేలా వ్యవహరించిన ఏపీ సచివాలయ ఉద్యోగులన్న విషయాన్ని మర్చిపోలేం. తమ స్వార్థం కోసం.. తాము వ్యవహరించిన వ్యవహారశైలి కారణంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న భావన వారిలో కానీ ఉండి ఉండే.. గొంతెమ్మ కోర్కెలు వారు కోరుకునే వారు కాదేమో. నిలువెత్తు స్వార్థం.. తమ ప్రయోజనాలు తప్పించి ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం పట్టని వారు.. ఏ దశలోనూ సొంత రాష్ట్రం కోసం త్యాగాలు చేసింది లేదు.

రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కాసేపు వదిలేద్దాం. విభజన తర్వాత పుట్టెడు కష్టాలతో ఏపీ కిందామీదా పడుతున్న వేళ.. ఉద్యోగ సంఘాలు అండగా నిలబడతామన్నట్లు వ్యవహరించాయా? అంటే లేదు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచితే.. మరుక్షణం తమకూ జీతాలు పెంచాలే అన్నారు కానీ.. రాష్ట్రం పరిస్థితి బాగోలేనప్పుడు మాకొద్దని ఎవరైనా అన్నారా? పెరిగే జీతాల్ని వదులుకునే త్యాగధనులు ఉంటారని అనుకోవటం అత్యాశే అనుకుందాం. ఆ విషయాన్ని కూడా వదిలేద్దాం.

ఏపీ రాజధాని అమరావతికి తరలి వెళ్లటానికి సైతం హెచ్ ఆర్ ఏ పెంచాలని.. ఆ వసతి కావాలని కోరికల చిట్టా విప్పారే కానీ.. తమది కానీ రాష్ట్రంలో ఉండటం సరికాదని.. ముఖ్యమంత్రి ఒకచోట..సచివాలయం మరోచోట ఉండటం సరికాదన్న భావన వ్యక్తం చేసినోళ్లు లేరు. ఆ విషయాన్ని కూడా వదిలేస్తే.. అమరావతి వెళ్లటానికి వద్దనే వారు.. మరో ఏడాది వాయిదా వేయాలని అడిగేవారే కానీ.. వెంటనే వెళ్లిపోదాం అనే వారు కనిపించని పరిస్థితి. ఏపీ ఉద్యోగుల తీరుపై సీమాంధ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. అశోక్ బాబు.. మురళీకృష్ణ లాంటి కొందరు నేతలు తెర మీదకు వచ్చి మాటలు చెబుతున్నారే కానీ.. అమరావతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. వాటిని భరిస్తూ పని చేస్తామన్న మాట ఒక్కరంటే ఒక్కరి నోట నుంచి కూడా మాట రాని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు తాజాగా మాట్లాడారు. కడపలో జరిగిన మహా సంకల్పదీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమం నాటి నుంచి ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని.. అమరావతికి తరలి వెళ్లేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లు కష్టపడితే.. రాష్ట్రం అభివృద్ధిపథంలోకి పయనిస్తుందని చెప్పుకొచ్చారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే.. జీతాల పెంపు లాంటి డిమాండ్లు ఐదేళ్లు వాయిదా వేసుకోవచ్చుగా..?
Tags:    

Similar News