ముస్లింలు పాలిచ్చే గోవులా?... తిండి దండ‌గేన‌ట‌!

Update: 2019-05-04 08:47 GMT
ఈ సార్వ‌త్రిక ఎన్నికల్లో సంచ‌ల‌న కామెంట్ల‌తో పాటు క‌ల్లోలం సృష్టించేలా ఉన్న కామెంట్ల‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేత‌లు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇత‌ర పార్టీల నుంచి కూడా ఈ త‌ర‌హా సంచ‌ల‌న కామెంట్లు వినిపిస్తున్నా... బీజేపీ నేత‌లు మాత్రం త‌మ‌దైన శైలిలో ఈ కామెంట్లు చేస్తూ త‌మ‌కు ఎవ‌రు కూడా సాటి రార‌ని తేల్చి చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీకి చెందిన ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత ప‌కాన్... ముస్లింల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ముస్లింలేమీ పాలిచ్చే గోవులు కాదు క‌దా... మ‌రి అలాంట‌ప్పుడు వారికి తిండి ఎందుకు దండ‌గ‌? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఓ నాలుగు రోజుల క్రిత‌మే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌గా... ఫకాన్‌ పై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రతిపక్ష నేత దేవవ్రత సైకియా స్పీకర్‌ కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముస్లింల మ‌నోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటుగా అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేయదని కూడా ప‌కాన్ అన్నారని సైకియా త‌న ఫిర్యాదులో స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడీ వ్య‌వ‌హారం పెద్ద అల‌జ‌డినే రేపేలానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ వ్యాఖ్య‌ల‌తోనే పెను క‌ల‌క‌లం రేగిందంటే... ఈ వ్యాఖ్య‌లు త‌న నోటి నుంచి వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేనంటూ ప‌కాన్ త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకుంటూ వివ‌ర‌ణ ఇచ్చిన వైనం వైర‌ల్ గా మారిపోయింద‌ని చెప్పాలి. పకాన్ వివ‌ర‌ణ ఎలా సాగిందంటే... *90 శాతం ముస్లింలు మాకు ఓటేయరు. అందుకనే అస్సామీ సామెతను ఉటంకిస్తూ ముస్లిం ఓటర్ల గురించి అలా మాట్లాడాను. పాలు ఇవ్వని గోవులకు తిండి దండగ అనేది నా అభిప్రాయం. వారి ఓట్లతో మాకు అవసరం లేదు. ముస్లిలం ఓట్లతో మా గెలుపోటములు డిసైడ్‌ కావు. ఎందుకంటే 90 శాతం హిందువులు మా పార్టీకి ఓటేస్తారు. అందుకే అలా మాట్లాడాను. అంతేగాని నేను ఎవరినీ ఎవరితో పోల్చలేదు* అని ప‌కాన్ త‌న‌దైన శైలి వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌రి ఈ వివాదం ఏ మేర ర‌చ్చ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News