క్రిస్మ‌స్ త‌ర్వాత పోలింగ్‌!

Update: 2018-08-28 06:04 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌న‌సులో ఏముందో కానీ.. ఆయ‌న చేస్తున్న ప‌నులు.. ఆ పార్టీ నేత‌లు చెబుతున్న లోగుట్టు మాట‌ల‌కు త‌గ్గ‌ట్లుగా అంచ‌నాలు అంత‌కంత‌కూ ఎక్కువైపోతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు కేసీఆర్ సానుకూలంగా ఉన్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది.

మూడు రోజులు ఢిల్లీలో తిష్ట వేసి.. ప్ర‌ధాని మోడీతో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ అయిన కేసీఆర్‌.. ముంద‌స్తుపై తాను అనుకున్న‌ట్లే సానుకూల సంకేతాన్ని పొందిన‌ట్లుగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ముంద‌స్తు తాయిలాల్ని ప్ర‌క‌టించేందుకు వీలుగా స‌రంజామాను సిద్ధం చేసుకున్నారు.

మోడీ స‌ర్కారుపై సానుకూల‌త పెంచేలా చేయ‌టంతో పాటు.. దాన్ని సాధించిన ఘ‌న‌త త‌మ సొంత‌మ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌టానికి వీలుగా ప‌లు అంశాల‌పై కేంద్రం హామీని పొంది రాష్ట్రానికి వ‌చ్చారు కేసీఆర్. ముంద‌స్తు దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ అయిన నేప‌థ్యంలో.. కేసీఆర్ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌పై ఈసీ సైతం సానుకూలంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అధికారికంగా ముంద‌స్తు అంశంపై ఎన్నిక‌ల అధికారుల‌కు వినతిని అంద‌జేసిన నేప‌థ్యంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలోనే తెలంగాణ‌లోనూ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కేసీఆర్ కానీ సెప్టెంబ‌రు 10 లోపు అసెంబ్లీని ర‌ద్దుకు సిఫార్సు చేసిన ప‌క్షంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్తాన్.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరంతో పాటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయి. అదే జ‌రిగితే.. న‌వంబ‌రు రెండో వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టం ఖాయం.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను డిసెంబ‌రు 31 నాటికి ముందే పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మామూలుగా అయితే.. అసెంబ్లీ ర‌ద్దు అయిన నాటి నుంచి ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌లునిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే.. మూడు నెల‌ల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలోతెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌ల్ని వాటితో పాటే క‌లిపి నిర్వ‌హించే వీలుంది. తెలంగాణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప‌క్షంలో అద‌న‌పు బ‌ల‌గాలు.. సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్ల‌కు త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క పోలీసు ఉన్న‌తాధికారుల‌తో పాటు.. మిగిలిన అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు దిశ‌గా పావులు క‌ద‌ప‌టం మొద‌లు పెట్ట‌టం.. స‌భ‌ను ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉన్న స‌మాచారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు స్వ‌యంగా ఈసీ దృష్టికి తేవ‌టంతో.. సీఈవో ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన అంశాల‌పై చ‌ర్చ‌లు షురూ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల‌తో పాటు ఎన్నిక‌ల్ని తెలంగాణ‌లో నిర్వ‌హించిన ప‌క్షంలో డిసెంబ‌రు 26-29 మ‌ధ్య‌న పోలింగ్ నిర్వ‌హించే వీలుంద‌ని చెబుతున్నారు. అదే నిజ‌మైన ప‌క్షంలో ఓట్ల లెక్కింపును డిసెంబ‌రు 31 లోపు పూర్తి చేసి.. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు దిశ‌గా అడుగులు ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. సో.. క్రిస్మ‌స్ త‌ర్వాత‌.. న్యూఇయ‌ర్ ముందు నాటికి కీల‌క‌మైన పోలింగ్‌.. ఫ‌లితాల వెల్ల‌డి ఉంటుంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News