పేద‌ల కోసం చావుకు సిద్ధం.. జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త వ‌ద్దు: అస‌దుద్దీన్‌

Update: 2022-02-04 13:31 GMT
తనకు జడ్ కేటగిరీ భద్రత వద్దని, అవ‌స‌ర‌మైతే.. పేద‌ల కోసం ఆత్మార్ప‌ణ చేసేందుకు, బుల్లెట్లు ఎదుర్కొనేందుకు తాను స‌ర్వం సిద్ధ‌మ‌ని  హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు.. త‌న‌కు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి బదులుగా దేశంలో నానాటికీ మృగ్య‌మైన‌ మతసామరస్యాన్ని పునరుద్ధరించాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను అడిగారు.  త‌న‌పై కాల్పులు జరిపిన వారిని చూసి భయపడట్లేదని ఎంపీ అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు.

అయితే.. ఎలాంటి ప్రాణాపాయం జ‌ర‌గ‌లేదు. అయితే.. జాతీయ‌స్థాయిలో గుర్తింపు, మైనారిటీ నాయ‌కుడు, ఎంపీ కూడా కావ‌డం, మ‌రోవైపు కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లుజ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యం.. ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అస్త్రంగా ప్ర‌తిప‌క్షాల‌కు మారుతుంద‌ని భావించిన కేంద్ర ప్ర‌బుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింది... అస‌దుద్దీన్‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. దానిని ఒవైసీ  నిర్ద్వ‌ద్వంగా తిరస్కరించారు. ''నాకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదు. నాపై కాల్పులు జరిపితే.. నేను ఆ బుల్లెట్లను స్వీకరిస్తా. దేశంలో పేదలు బతికితేనే నేనూ బతుకుతాను. బదులుగా ఈ విద్వేషవ్యాప్తిని ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నా``

ఇలా జరిగినంత మాత్రాన.. తన ట్రాక్ నుంచి పక్కకు తప్పుకోనని, ఉత్తర్ప్రదేశ్ ప్రజలే బ్యాలెట్ ద్వారా వారికి తగిన సమాధానం చెప్తారని అన్నారు. ఇదిలావుంటే, అసదుద్దీన్ ఒవైసీ కాల్పుల ఘటనపై ఫిబ్రవరి 7న పార్లమెంటులో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోడీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తానని ఎంఐఎం అధినేత వెల్లడించారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఒవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మొత్తానికి ఈ విష‌యం.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసింది.
Tags:    

Similar News