రాక్ష‌సుల పోస్ట‌ర్ గ‌ర్ల్స్ ను రాళ్ల‌తో కొట్టి చంపారు

Update: 2015-11-26 14:50 GMT
పాముకు రోజూ పాలు పోసినా ఏదో ఒక రోజు కాటేస్తుందంటారు. కాటువేయ‌టం పాము స‌హ‌జ ల‌క్షణం. అలానే.. మ‌నుషులు చంపే రాక్ష‌సులకు ప్రాణాలు తీయ‌టం స‌హ‌జ చ‌ర్య‌. నాగ‌రిక ప్ర‌పంచంలో అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఐఎస్ తీవ్ర‌వాదులు మ‌రో దారుణానికి పాల్ప‌డ్డారు.

త‌మ చ‌ర్య‌ల్ని చూసి స్ఫూర్తి చెంది ఇళ్ల‌ల్లో నుంచి పారిపోయి మ‌రీ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌మ్రా కెసినోవిక్ (17).. స‌బినా సెలిమోవిక్ (15)ను అత్యంత దారుణంగా..కిరాత‌కంగా కొట్టి చంపేసిన ఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నా నుంచి స‌మ్రా.. ట్యూనిషియా నుంచి స‌బినా ఇళ్ల‌ల్లో నుంచి పారిపోయి ఐఎస్ పోరాటంలో పాల్గొనేందుకు సిరియా చేరుకున్నారు. ఇంట్లో నుంచి వ‌చ్చేసే స‌మ‌యంలో త‌మ గురించి వెత‌కొద్ద‌ని.. అల్లా సేవ‌కు వెళుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. అనంత‌రం వారు ఐఎస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. వారి సాయంతో ప్ర‌పంచంలోని ప‌లువురు అమ్మాయిల్ని ఆక‌ర్షించేందుకు వీలుగా.. ఐఎస్ ఈ ఇద్ద‌రు టీనేజ‌ర్ల చేత క్యాలెండ‌ర్ ఒకటి వేయించింది.

ఐఎస్ తీవ్ర‌వాదుల‌తో పాటు.. ఆయుధాలు ప‌ట్టుకొని ఫోజులిచ్చిన ఈ ఇద్ద‌రు అమ్మాయిల్ని ఐఎస్ క్యాలెండ‌ర్ గ‌ర్ల్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఐఎస్ తీవ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌ల్ని చూసిన ఈ ఇద్ద‌రు టీనేజ‌ర్లు బెదిరిపోయి.. తీవ్ర‌వాదుల న‌గ‌ర‌మైన ర‌క్కా నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ‌ను స‌మ‌ర్థించేందుకు వ‌చ్చిన‌ప్పుడు వారితో క‌లిసి ఫోటోలు దిగిన తీవ్ర‌వాదులు.. పారిపోతున్న విష‌యాన్ని గుర్తించి వారిని బంధించారు. త‌మ‌లోని రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. వారిని పెద్ద గొయ్యిలో దించి.. వారిని రాళ్ల‌తో కొట్టి చంపారు.ఇంత దారుణంగా హ‌త‌మార్చ‌టం ఇప్పుడు ప్ర‌పంచానికి షాకింగ్ గా మారింది. త‌మ క్యాలెండ‌ర్ గ‌ర్ల్స్ ను తామే చంపుకున్న ఐఎస్ తీవ్ర‌వాదుల్ని చూసిన‌ప్పుడు పాము.. పాలు గుర్తుకు రాక మాన‌దు.
Tags:    

Similar News