ట్రంప్ వెనకున్న కోనసీమ కుర్రాడికి లక్..!

Update: 2016-11-09 11:18 GMT
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అనూహ్య‌ ఫ‌లితాలు వెలువడ్డ సంగ‌తి తెలిసిందే. సౌమ్యురాలు - మేధావి అనే ఇమేజ్ ఉన్న హిల్ల‌రీ క్లింట‌న్ అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, మొద‌ట్నుంచీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చి డోనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించారు. అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కాలంటే క‌నీసం 270 ఎల‌క్ట్రోర‌ల్ ఓట్లు కావాల్సి ఉంటుంది. కానీ, ఆ మ్యాజిక్ ఫిగ‌ర్ ను ట్రంప్ సునాయాసంగా దాటేశారు. మొత్తం 538 ఎల‌క్ట్రోర‌ల్ ఓట్ల‌కుగానూ డోనాల్డ్ ట్రంప్ కు 276 వ‌చ్చాయి. హిల్ల‌రీ క్లింట‌ర్ 218 ఓట్ల‌తో వెన‌కంజ‌వేశారు. మొత్తానికి అత్యంత ఉత్కంఠ వాతావ‌ర‌ణంలో ట్రంప్ అధ్య‌క్షుడు అయ్యారు.

నిజానికి, అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ అనేది చాల క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. క‌నీసం ఓ ఏడాదిపాటు ఈ ఎన్నిక‌ల హ‌డావుడి ఉంటుంది. ఎన్నో వ్యూహాలూ వ్యూహ‌క‌ర్త‌లు - మేథో మ‌థ‌నాలు - చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.... ఇలా అధ్య‌క్ష ప‌దవికి పోటీప‌డే అభ్య‌ర్థి వెన‌క ఎంతోమందితో కూడిన పెద్ద టీమ్ వ‌ర్కే ఉంటుంది. ఈసారి ట్రంప్ టీమ్ లో మ‌న తెలుగువాడు స‌త్తా చాటుకున్నాడు. ట్రంప్ వ్యూహాత్మ బృందంలో ఒక స‌భ్యుడిగా ఉన్నారు ఎన్నారై అవినాష్‌. ట్రంప్ విజ‌యంలో ఆయ‌న కీల‌కపాత్ర పోషించార‌ని, ట్రంప్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గానే అవినాష్ కు త‌గిన గుర్తింపు ఉంటుంద‌ని భావిస్తున్నారు. అవినాష్ కు ఆరిజోనా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి - లేదా పార్టీలో ఏదైనా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని ఎన్నారైలు చెప్పుకుంటున్నారు.

ఇంత‌కీ ఈ అవినాష్ ఎక్క‌డి వారంటే... కోన‌సీమ కుర్రాడు. రావుల‌పాలెం మండ‌లంలోని ముమ్మిడివ‌ర‌ప్పాడు గ్రామానికి చెందిన‌వారు. ఇర‌గ‌వ‌ర‌పు పాపారావుకి రెండో కుమారుడు అవినాష్‌. ఇత‌డి తాత త‌మ్మిరాజు మున‌సబుగా ప‌నిచేశారు. రాజ‌మహేంద్రవ‌రంలో ప్రాథ‌మిక విద్య‌న‌భ్య‌సించారు అవినాష్. ఆ త‌రువాత‌ - విజ‌య‌వాడ‌లో ఇంట‌ర్‌ - వైజాగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ల‌క్నో ఐఐఎం నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. రాజ‌కీయాల‌పై చిన్న‌ప్ప‌టి నుంచీ ఆసక్తి ఉండ‌టంతో ఐబీఎంలో ప‌నిచేస్తూనే పార్టీల‌పై ప్ర‌జ‌ల్లో ఉండే అభిప్రాయాల‌ను విశ్లేషిస్తూ డాటా అనాల‌సిస్ చేస్తుండేవారు. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌లో వైకాపా త‌ర‌ఫున వ్యూహ‌క‌ర్త‌గా కూడా ప‌నిచేశారు. అనంత‌రం అమెరికాలో ఉద్యోగిగా ఉన్న భార్య ద‌గ్గ‌ర‌కి వెళ్లారు. అప్పుడే ఆరిజోనా గ‌వ‌ర్న‌ర్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.  అక్క‌డ కూడా డాటా అనాలసిస్ చేస్తూ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రేసులో ఉన్న జూసీకి ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎప్పటిక‌ప్పుడు మెయిల్స్ పంపుతూ ఉండేవారు.

ఆ త‌రువాత‌,  అవినాష్ కి రిపబ్లిక‌న్ పార్టీ కూడా అవ‌కాశం ఇచ్చింది. ట్రంప్ వ్యూహ‌క‌ర్త‌ల బృందంలో స‌భ్యునిగా చేరారు. మొద‌ట్లో డాటా అనాలసిస్ చేశావారు. అయితే, అవినాష్ వ్యూహాల్లో ద‌మ్మును గుర్తించిన పార్టీ ఆరిజోనా రాష్ట్రానికి ఎగ్జిక్యుటివ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. అక్క‌డి నుంచి అవినాష్ పేరు మార్మోగుతూ వ‌స్తోంది. పార్టీ త‌ర‌ఫున జ‌రుగుతున్న స‌భ‌ల్లో, చ‌ర్చా వేదిక‌ల్లో అవినాష్ వ్యూహాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు ట్రంప్‌.  ఇన్ ఆ ఎండ్‌.. అవినాష్ వ్యూహాలు ట్రంప్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయ‌ని చెప్పాలి. ట్రంప్ వ్యూహ‌క‌ర్త‌ల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించిన అవినాష్ కు కూడా త‌గిన గౌర‌వం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఈసారి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌కపాత్ర పోషించిన అవినాష్... మ‌న‌వాడే అని తెలుగువారు గ‌ర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News