హోదా అడిగిన జ‌గ‌న్ స‌ర్కారుకు మోడి మొండిచేయ్యేనా?

Update: 2019-07-26 05:28 GMT
విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం ఏపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. విభ‌జ‌న కార‌ణంగా భారీగా చోటు చేసుకున్న రెవెన్యూ లోటును పూడ్చేందుకు అండ‌గా నిలుస్తామ‌న్న కేంద్రం అదే ప‌నిగా మాట త‌ప్ప‌టం ఏపీకి ఇబ్బందిగా మారింది. లోటు బ‌డ్జెట్ తో ఉన్న ఏపీని ఆదుకుంటామ‌ని.. హోదా ఇచ్చి ఆర్థిక ద‌న్ను క‌లిగేలా చేస్తామ‌న్న మాట‌ను మ‌ర్చిపోవ‌టంతో ఏపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింది.

స్వ‌యంగా ప్ర‌ధానే రాజ్య‌స‌భ‌లో ఇచ్చిన హామీని.. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం తూచ్ అనేయ‌టం.. హోదా అన్న‌ది ముగిసిన అధ్యాయంగా పేర్కొన‌టం చూస్తే.. ఏపీ ప్రజ‌ల మీద మోడీ స‌ర్కారుకు ఎందుకంత కోప‌మ‌న్న‌ది ఎంత‌కూ అర్థం కాని విష‌యంగా చెప్పాలి.

హోదా మీద మాట మార్చేసిన మోడీ స‌ర్కారు.. అదే ప‌నిగా హోదా అన్న‌ది ముగిసిన అధ్యాయంగా తేల్చేస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీని ఆదుకునేందుకు ఎలాంటి సాయాన్ని ఇచ్చేందుకు సుముఖంగా లేని వైనం త‌ర‌చూ క‌నిపిస్తోంది. తాజాగా అలాంటి ఉదంత‌మే మ‌రొక‌టి చోటు చేసుకుంది. తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవ‌టానికి వీలుగా క‌నీసం ప్ర‌త్య‌క్ష ప‌న్ను రాయితీ అయినా ఇవ్వాల‌న్న విన‌తిని సైతం నిర్ద్వందంగా రిజెక్ట్ చేసిన వైనం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండ‌లేం.

ఏపీని ఆదుకోవ‌టానికి వీలుగా ప‌న్ను రాయితీ ఇవ్వాలంటూ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ.. ఏపీకి ప్ర‌త్యేకంగా ఎలాంటి రాయితీలు ఇవ్వ‌మ‌ని తేల్చేశారు. ఒక రాష్ట్రానికి రాయితీలు ఇస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి అభ్యంత‌రాలు వ‌స్తాయ‌న్న బూచిని చూపించి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఒక రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా రాయితీలు అమ‌లు చేయ‌టం సాధ్యం కాద‌ని చెప్ప‌టం చూస్తే.. పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. కాంగ్రెస్‌.. బీజేపీలు కూడ‌బ‌లుక్కొని మ‌రీ ఏపీ విభ‌జ‌న బిల్లును పాస్ చేయ‌టం సాధ్య‌మ‌వుతుందా? అన్న సందేహం రాక మాన‌దు.

ఏపీకి జ‌రిగిన అన్యాయం మీద ఏ మాత్రం సానుభూతితో వ్య‌వ‌హ‌రించ‌కుండా.. మొండిత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న మోడీ స‌ర్కారుకు ఏపీ ప్ర‌జ‌లు బుద్ధి చెప్ప‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ ఆర్థిక క‌ష్టాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగే విష‌యంలో మోడీ స‌ర్కారు సానుకూలంగా ఉండ‌క‌పోవ‌టానికి కార‌ణం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హోదా విష‌యంలో రాజీ ప‌డ‌క‌పోవ‌టంగా చెబుతున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్న జ‌గ‌న్ మీద మోడీ స‌ర్కారు గుర్రు వారికే మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని క‌మ‌ల‌నాథులు ఎప్ప‌టికి గుర్తిస్తారో?
Tags:    

Similar News