టీడీపీ వాళ్లకు పనిచేసే వలంటీర్లకు పురస్కారాలు..?

Update: 2021-04-23 13:30 GMT
అధికారం బెల్లం లాంటిది. బెల్లం చుట్టూ ఈగల వలే.. అధికారం చుట్టూనే నేతలు ఉంటారు. ఈ క్రమంలోనే 2019 ఎలక్షన్స్ కు ముందు టీడీపీలో పనిచేసిన చాలా మంది.. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పార్టీలోకి జంప్ చేశారు. ఆ పాత టీడీపీ నేతలకే గ్రామ వలంటీర్ గా పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి.  అయితే కులమతాలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇందులో ఎలాంటి పైరవీలు లేవని ప్రభుత్వం తెలిపింది. కొందరు వైసీపీ నాయకులు ఎంతో కాలంగా పార్టీని పట్టుకొని పనిచేస్తున్నా.. తమకు గుర్తింపు ఇవ్వలేదని నిరసన తెలిపారు. అంతేకాకుండా కొందరు గ్రామ, వార్డు వలంటీర్లను తమకు తెలియకుండానే నియమించారని ఆయా గ్రామాల సర్పంచులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

 అయితే జగన్ సర్కార్ నెత్తిన పెట్టుకున్న వలంటీర్లు ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించారు. తమకు జీతాలు పెంచాలని కొన్ని నెలల కిందట ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం వలంటీర్లకు ఉగాది పురస్కారాలను అందజేస్తానని తెలిపింది. ఉత్తమ సేవలందించిన వారిని సత్కరించింది. అయితే ఉగాది పురస్కారాలు పొందిన వారిలో ఎక్కువగా టీడీపీకి చెందిన వాళ్లే ఉన్నారని కొందరు  వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా పురస్కారాలకు ఉత్తమ వలంటీర్ల ఎంపిక బాధ్యతను అధికారులకే అప్పగించారని, ఎమ్మెల్యేలు సర్పంచులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో వారు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికే పురస్కారాలు అందించారని అంటున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్లకు, ఆ పార్టీ సానుభూతిపరులకే లబ్ధి చేకూరడంతో అసలైన వలంటీర్లు నిరాశతో ఉన్నారట.

ఈ విషయంపై సదరు వలంటీర్లు ఎమ్మెల్యేలు, సర్పంచుల దగ్గరికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియదని, తమ చేతిలో ఏమీ లేదని అంటున్నారు. పురస్కారాల గురించి అంతా అధికారుల చేతుల్లోనే ఉందని చేతులెత్తేస్తున్నారట. దీంతో తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట. దీనిపై రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News