కేసీఆర్ దీక్ష...చేసుకోమంటున్న మంత్రిగారు

Update: 2015-06-24 11:11 GMT

సెక్షన్‌-8 ....ఓటుకు నోటు ఘాటును మరింత పెచ్చిన అంశం. ఈ సెక్షన్ ప్రకారం ఇరు రాష్ర్టాలకు హైదరాబాద్ పై పెత్తనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే...అది కుదరని పని అంటూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు.  ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు నిరసన మొదలుపెడితే....పలు రాజకీయపార్టీలు ఆందోళనకు తెరలేపాయి. 

సెక్షన్ 8ను హైదరాబాద్ లో అమలు చేయాలనే ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలొచ్చాయి. ఒకవేళ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే...తాను ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చర్చసాగింది. దీనిపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. విభజన చట్టాన్ని తానే తయారు చేశానన్న కేసీఆర్‌ సెక్షన్‌-8ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. కేంద్రం నిర్ణయిస్తే వద్దనడానికి కేసీఆర్‌ ఎవరని ప్రశ్నించారు.

తమకు దక్కిన అన్ని హక్కులను పొందుతూ, తమ రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాము హైదరాబాద్‌లోనే ఉంటామని, ఏం చేసుకుంటారో చేసుకోమనండి అని తేల్చిచెప్పారు. సెక్షన్ 8 లేదా మరేదైనా రూపంలో ఏపీ ప్రయోజనాలను అడ్డుకునేందుకు కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలనుకుంటే...చేసుకోమనండి అని వ్యాఖ్యానించారు. దీక్షలు కేసీఆర్ కు అలవాటే కదా అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News