భారత దేశంలో బాధ్యత గల పదవిలో ఉండి కూడా తమ అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకునే రాజకీయ నాయకులకు నేటి కాలంలో కొదవే లేదు. అందులోనూ ప్రత్యేకించి....తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జాబితాలో అందరికన్నా ముందుంటారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని నేతల నుంచి ...పార్టీ ఎప్పుడు స్థాపించడానికి ముందు జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నామని చెప్పుకునే నేతల వరకు టీడీపీలో ఉన్నారు. బోడిగుండుకు మోకాలుకు ముడెట్టే `ఇంటిలిజెంట్ పొలిటీషియన్స్` టీడీపీ సొంతం. తాజాగా, మంత్రి అయ్యన్న పాత్రుడు అదే తరహాలో చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోదీ పాలనను ఎద్దేవా చేసేందుకు అమాత్యుల వారు ఓ అద్భుతమైన ఉదాహరణను ఎంచుకున్నారు. మోదీ పాలనలో జీఎస్టీ పుణ్యమా అంటూ....కొత్త చీరలు కొనే భాగ్యం కూడా కరువైందని ఓ మహిళ తనతో వాపోయినట్లు అయ్యన్న పాత్రుడు ఉదహరించడం చర్చనీయాంశమైంది.
గతంలో మంత్రి గారు రైలు ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఆయన పక్కన ఓ మహిళ కూర్చొని ఉందట. ఆమె కట్టుకున్న చీర అయ్యన్న పాత్రుడు గారిని విపరీతంగా ఆకర్షించిందట. అటువంటి చీరనే కొందామని ...ఆ చీర రేటు ఎంత...ఎక్కడ కొన్నారు...అని ఆమెను అడిగారట. దానికి ఆ మహిళ జవాబిస్తూ మోదీపై విరుచుకుపడిందట. ఆ చీరను తాను మూడేళ్ల క్రితం కొన్నానని, ఇపుడు జీఎస్టీ వల్ల చీరలు - జాకెట్లు కొనలేకపోతున్నానని వాపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా మంత్రిగారే విన్నవించడం విశేషం. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలంతా బీజేపీ - మోదీపై సందు దొరికితే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, అయ్యన్న పాత్రుడు చెప్పిన ఉదాహరణ మాత్రం ఆ విమర్శలకు సింక్ అవనట్లు కనిపిస్తోంది. సాధారణంగా తోటి ప్రయాణికులను చనువు తీసుకొని ఈ తరహా ప్రశ్నలు అడిగేంత తీరిక మంత్రిగారికి ఉందా అని ఎవరికైనా అనిపించకమానదు. మహిళలు...మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేందుకు ఆయన ఈ ఉదాహరణను ఎంచుకోవడం వెరైటీగా ఉందని అనిపిస్తోంది. ఏది ఏమైనా టీడీపీ నేతల రూటే సెపరేటు అని చెప్పక తప్పదు.