తెలుగుదేశం పార్టీపై, ఏపీ సర్కారుపై ఇటీవలి కాలంలో ఘాటుగా స్పందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైనమిక్ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సీనియర్ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాల విషయంలో ఏపీ సర్కారు కొద్దికాలం క్రితం తీసుకున్న నిర్ణయంపై రోజా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు ప్రజా సంక్షేమం కంటే మందుబాబుల సంక్షేమం కోసం చూస్తున్నారని, కేబినెట్ అంతా తాగుబోతులమయం అయిందని ఆరోపించారు. ఈ కామెంట్లపై అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ రోజాకు మందు తాగనిదే పొద్దుగడవదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోజా ప్రతిరోజూ మద్యం సేవిస్తారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. హాఫ్ బాటిల్ మద్యం తాగనిదే రోజాకు నిద్ర రాదని అయ్యన్నపాత్రుడు అన్నారు. అలాంటి వ్యక్తి తమపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజాను ఐరన్ లెగ్ అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదని అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. గతంలోనూ ఇదే జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగనమోహన్ రెడ్డి రోజాను పార్టీ నుంచి పంపించేయాలని లేదంటే రాబోయే కాలంలోఆయన జైలు పాలవడం ఖాయమని అయ్యన్నపాత్రుడు అన్నారు. కాగా, మరోమంత్రి అమర్‌నాథ్ రెడ్డి సైతం రోజాపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్న రోజా ముందుగా తాను మద్యం మానివేసి ఇతరులకు చెప్పాలన్నారు.