అయ్యో అయ్య‌న్నా : న‌ర్సీప‌ట్నంలో టెన్ష‌న్ .. !

Update: 2022-06-20 04:16 GMT
వైసీపీ ప్ర‌భుత్వానికి, ప్ర‌ధాన ప్ర‌తిపక్ష పార్టీ టీడీపీకి మ‌ధ్య వాగ్యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇప్ప‌టిదాకా మాట‌ల‌కే ప‌రిమితం అయిన వైసీపీ  స‌ర్కారు తొలిసారి త‌న‌దైన శైలిలో టీడీపీకి బుల్డోజ‌ర్ ట్రీట్మెంట్ ఇవ్వ‌డంపై రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది.

యూపీ త‌ర‌హాలో ఏపీ లో రాజ‌కీయాలు న‌డ‌వ‌వు అని టీడీపీ అంటోంది. ఈ సంద‌ర్భంగా ఛ‌లో న‌ర్సీప‌ట్నం నిర్వ‌హించి, త‌న ధిక్కార స్వ‌రంను తీవ్ర స్థాయిలో వినిపింప‌జేయాల‌ని చూస్తోంది టీడీపీ. ఆ విధంగా ఇవాళ నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇచ్చింది. ఈనేప‌థ్యంలో నాయ‌కుల‌ను పోలీసులు ఎక్క‌డిక్క‌డ గృహ నిర్బంధాలు చేస్తున్నారు అన్న‌ది  ప్రాథ‌మిక స‌మాచారం.

న‌ర్సీప‌ట్నంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేత ఘ‌ట‌న‌పై టీడీపీ సీరియ‌స్ అవుతోంది. ఇవాళ ఛ‌లో న‌ర్సీప‌ట్నంకు పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఏ క్ష‌ణాన అయిన మాజీ మంత్రి అయ్య‌న్న‌తోపాటు ఆయ‌న కుమారులు విజ‌య్, రాజేశ్ అరెస్టు అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వి స్టాండ్ విత్ అయ్య‌న్న పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి, ప్ర‌త్యేక రీతిలో ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధం అవుతోంది. ఒక‌వేళ మాజీ మంత్రి అయ్య‌న్న అరెస్టు అయితే రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు సిద్ధం అవుతోంది.

ఇంకొక వైపు మాజీ మంత్రి అయ్య‌న్న ఇంటి గోడ కూల్చివేత పై మ‌రో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పందించారు. వ‌రుస‌గా బీసీ నేత‌ల‌నే తెలుగుదేశం పార్టీకి చెందిన క్రియాశీల‌క నాయ‌కుల‌నే టార్గెట్ చేస్తూ జ‌గ‌న్ వినోదం పొందుతున్నారు అన్న త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నించినందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రడు ఇంటిని జగన్ రెడ్డి తన అధికారులను అడ్డుపెట్టకుని, పోలీసు బలగాలతో అర్థరాత్రి కూలదోశారు అని అన్నారు.

దీనికి కూడా అధికారులు ఓ పిట్టకథ చెప్పుకొచ్చారు. గతంలో కూడా బీసీ నాయకులు పల్లా శ్రీనివాస్, సబ్బం.హరి, ఇలా అనేక మంది బీసీ నాయకులు, కార్యకర్తల ఆస్తులపై జగన్ రెడ్డి దాడులకు పాల్పడ్డార‌ని చెబుతూ ఆవేద‌న చెందారు.

ఇటీవల జల్లయ్య అనే బీసీ టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు అతిదారుణంగా చంపితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం అత్యంత దారుణం అని వ్యాఖ్యానించారు.ఆ విధంగా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని  జగన్ రెడ్డి నిరూపించుకున్నార‌ని వ్యంగ్య రూపంలో వ్యాఖ్య‌లుచేశారు.  బీసీలంటే జగన్ రెడ్డికి కడుపుమంట అని అంటూ మండిప‌డ్డారు.
Tags:    

Similar News