షూటింగ్ కు నో చెప్పిన ఓయూ విద్యార్థులు

Update: 2015-11-16 04:19 GMT
ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో పతాక శీర్షికల్లో కనిపించిన ఓయూ పేరు.. గత కొద్దికాలంగా మీడియాలో పెద్దగా వినిపించని పరిస్థితి. తాజాగా అందుకు భిన్నమైన ఒక అంశంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ను ఉస్మానియా క్యాంపస్ లోని అర్ట్స్ కాలేజీ వద్ద చేయాలని భావించారు. ఇందులోభాగంగా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసే సమయంలో ఓయూ విద్యార్థులు షూటింగ్ ను అడ్డుకున్నారు. కోర్టు సన్నివేశాల కోసం అర్ట్స్ కాలేజీ వద్ద షూట్ చేయాలని భావించగా కొందరు విద్యార్థులు షూటింగ్ కు అడ్డు చెప్పారు. అజారుద్దీన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీతో పాటు.. యూనిట్ సభ్యులు షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు.

ఈ షూటింగ్ క్యాన్సిల్ కావటం వల్ల చిత్ర నిర్మాణానికి రూ.25లక్షలు తాము నష్టపోయినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. తాము షూటింగ్ చేసేందుకు అనుమతులు అన్నీ ఉన్నాయని.. కొందరు విద్యార్థి నాయకులు డబ్బులు అడిగారని.. అందుకు నో చెప్పటంతో ఇలా అడ్డుకున్నారని చిత్ర బృందం ఆరోపణలు చేశారు.

మరోవైపు.. విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ.. ఓయూలోని అర్ట్స్ కాలేజీ చారిత్రక కట్టడమని.. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని.. అర్ట్స్ కాలేజీలో సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తే.. నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని.. అందుకే అడ్డుకున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో..?
Tags:    

Similar News