బాబ్రీమసీదు గుట్టువిప్పిన ముస్లిం చరిత్రకారుడు

Update: 2016-01-30 10:21 GMT
అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందూ దేవాలయపు ఆనవాళ్లు కనిపించాయన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ రీజనల్‌ డైరెక్టర్‌ కె.కె. ముహమ్మద్‌ ఈ సంగతి తాజాగా వెల్లడించడంతో హిందువులు - బీజేపీ శ్రేణులు తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒక ముస్లిం చరిత్రకారుడు - మేధావి ఈ సంగతి వెల్లడించడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆయన కేవలం బాబ్రీ మసీదే కాకుండా తాజ్ మహాల్ - కుతుబ్ మీనార్ కూడా హిందూ దేవాలయాలు పడగొట్టి కట్టినవేనని ఆధారాలతో చెబుతున్నారు.
    
1976-77 సంవత్సరాల్లో అప్పటి డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బి.బి. లాల్‌ నేతృత్వంలోని బృందం బాబ్రీ మసీదు ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించినప్పుడు హిందూ దేవాలయ శిథిలాలు బైటపడ్డాయని మొహమ్మద్ తెలిపారు. ఎన్జన్‌ ఎణ్ణ భారతీయన్‌ (నేను భారతీయుడిని) అన్న తన తాజా పుస్తకంలో ఆయన తన జ్ఞాపకాలను ఉటంకించారు. ఇర్ఫాన్‌ హబీబ్‌ - రొమిల్లా థాపర్‌ వంటి వామపక్ష భావజాలం కలిగిన చరిత్రకారులు బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కాకుండా అడ్డుపడుతున్నారని ఆయన చెప్పారు. ముస్లిం మేధావి వర్గం వామపక్ష భావజాల చరిత్రకారుల భాష్యాలకు లోనుకాకుండా ఉండినట్లయితే బాబ్రీ మసీదు వివాదం ఎప్పుడో పరిష్కారమై ఉండేదని ఆయన అన్నారు. అయోధ్యలో 19 శతాబ్దానికి ముందు నిర్మించిన ఆలయాలు ధ్వంసం చేసిన ఆనవాళ్లు ఏమీ లేవని రొమిల్లా థాపర్‌ - బిపిన్‌ చంద్ర - ఎస్‌. గోపాల్‌ వంటి చరిత్రకారులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌ హబీబ్‌ - ఆర్‌ ఎస్‌ శర్మ - డిఎన్‌ జా - సూరజ్‌ బెన్‌ - అఖ్తర్‌ అలీ వంటి చరిత్రకారులు వారి వాదనలతో ఏకీభవించారని ముహమ్మద్‌ తెలిపారు. బాబ్రీ మసీదు స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు హిందూ దేవాలయానికి చెందిన స్తంభాలు బైటపడ్డాయని ముహమ్మద్‌ చెప్పారు. మొత్తం 14 స్తంభాలు బైటపడ్డాయని, అన్నింటి మీదా 11, 12వ శతాబ్దంనాటి హిందూ ఆలయాల్లోని స్తంభాలపై ఉన్న చిత్రాలు చెక్కి ఉన్నాయని ఆయన తెలిపారు. మసీదును హిందూ ఆలయం శిథిలాలపై నిర్మించారనేది సుస్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు.
    
మరోవైపు ఈ విషయమై ఆయన అనేక పత్రికలకు వ్యాసాలు రాసి పంపగా కేవలం ఒక్క పత్రికే దాన్ని ప్రచురించిందని ఆయన చెప్పారు. వామపక్ష భావజాల చరిత్రకారులు అలహాబాద్‌ హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. కుతుబ్‌ మినార్‌ - తాజ్‌ మహల్‌ కూడా హిందూ దేవాలయాలపైనే నిర్మించారని ఆయన చెప్పారు. ముహమ్మద్‌ 2012లో పదవీ విరమణ చేసిన తరువాత ఆగాఖాన్‌ ట్రస్టు ప్రాజెక్టులో పని చేస్తున్నారు.
Tags:    

Similar News