బాబు ఓట‌మి...విజ‌య‌సాయి కొత్త విశ్లేష‌ణ‌

Update: 2019-02-10 12:50 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. తాజా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీడీపీ నేత‌లు నిర‌స‌న తెల‌ప‌డం, వైసీపీ విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఆయ‌న ఘాట‌గా స్పందించారు. ``హోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి చెబ్తోంది. చంద్రబాబే ప్యాకేజి ముద్దు అన్నాడు. యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటే!` అంటూ మండిప‌డ్డారు.``ప్యాకేజీ కోసం హోదాను తాకట్టుపెట్టిన ప్రజా ద్రోహి చంద్రబాబు. యూటర్న్ తీసుకుని హోదా రాగం ఎత్తుకున్నా ప్యాకేజీ ఒప్పందాన్ని రద్దు చేయమని కేంద్రాన్ని కోరలేదు. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధుల కోసం చాటుగా ఢిల్లీని దేబిరిస్తూనే మరోపక్క దొంగ దీక్షలు చేస్తున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతం కదా మరి!`` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు.


బాబుకు కొత్త‌ ఫోబియా ప‌ట్టుకుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్సే కారణమంటాడు. ఈయనకు కేసీఆర్ అన్నా...మోడీ అన్నా వణుకు. అదిగో నాలాగా వాళ్లకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడు. ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ!`` అంటూ పంచులు కురిపించారు. ``సీఎం అయిన రోజు నుంచే పసుపును నల్లరంగుగా మార్చేశారు బాబు. ఫించన్లు, ఇళ్ళు, ఇళ్ళ పట్టాలకు రేట్‌ కార్డు పెట్టి ఎల్లో సేనలు జనాన్ని కొల్లగొడితే, ప్రాజెక్ట్‌లు, కాంట్రాక్ట్‌ల్లో బాబు వేల కోట్లు దోచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. బాబు పాలన రాష్ట్ర చరిత్రలో ఓ చీకటి అధ్యాయం.

వరాల జల్లు కురిపిస్తున్నా జనంలో ఎదురుగాలి చూసి బాబుతో సహా మంత్రులకు మతి తప్పుతోంది. మనం ఇస్తున్నవన్నీ తీసుకుంటూ మనకే వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ జనం మధ్య ఒక మంత్రి బూతు పురాణం విప్పితే, మీ ఇష్టప్రకారం ఓట్లేస్తే కుదరదు అని ఇప్పుడు చంద్రబాబు జనాన్ని బెదిరిస్తున్నారు.`` అంటూ వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News