ఇదంతా కేసీఆర్ దమనకాండ అన్న గులాబీ మాజీ నేత

Update: 2019-11-14 14:30 GMT
గత ఏడాది ఈ సమయానికి టీఆర్ఎస్ పార్టీ నేతగా వ్యవహరిస్తూ.. ఎన్నికల్లో సీటు దక్కని అతి తక్కువ సిట్టింగ్ అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచి.. ఆ అవమానంతో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు సినీ నటుడు కమ్ మాజీ మంత్రి బాబు మోహన్. తాజాగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వేళ.. ప్రభుత్వ తీరుకు మనస్తాపానికి గురై మృతి చెందిన నారాయణ ఖేడ్ డిపో కండక్టర్ నాగేశ్వర్ భౌతికకాయాన్ని సందర్శించిన బాబు మోహన్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బాబూమోహన్.. తెలంగాణ రాష్ట్రంలో నియంత రాజ్యం నడుస్తుందన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు.. ఉద్యోగులు కేసీఆర్ నియంతృత్వ ధోరణికి చెక్ పెడతారన్నారు.

బంగారు తెలంగాణ తీసుకొస్తానన్న కేసీఆర్.. చివరకు ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ఈ దమనకాండకు కేసీఆరే బాధ్యులన్నారు. ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. భూమి పుట్టిన తర్వాత కేసీఆర్ లాంటి పాలకుడు వచ్చి ఉండరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అహంకారాన్ని పక్కన పెట్టి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలన్న బాబు మోహన్.. సమ్మె కారణంగా ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. వారి ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి తగక మానదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో అదే ప్రజలు ప్రాణత్యాగాలకు పాల్పడుతుంటే అడిగే నాథుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. 
Tags:    

Similar News