పవన్ తో బద్వేల్ ప్రచారం...?

Update: 2021-10-05 00:30 GMT
ఉప ఎన్నిక వద్దు, పోటీ అసలు వద్దు అంటూ స్వస్తి చెప్పేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ సమయంలో ఆయన మిత్రపక్షం బీజేపీతో చర్చించారో లేదో తెలియదు కానీ ఇపుడు బీజేపీ మాత్రం మేము పోటీకి రెడీ అంటోంది. బద్వేల్ పోరుకు బస్తీమే సవాల్ అని కమలనాధులు తెగ హుషార్ చేస్తున్నారు. త్వరలోనే బీజేపీ అభ్యర్ధిని ప్రకటిస్తామని కూడా సోము వీర్రాజు అంటున్నారు. అంతే కాదు తమ పార్టీ అభ్యర్ధి తరఫున ప్రచారం చేయడానికి మిత్రుడు పవన్ బద్వేల్ వస్తారని కడు ధీమాగా ప్రకటిస్తున్నారు.

అంతే కాదు పవన్ ఎప్పటికీ మా మిత్రుడే, మా దోస్తీ మీద అంతా బేఫికర్ గా ఉండొచ్చు అంటూ కూడా చెబుతున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు ఊహాగానాల  మీద అసలు మాట్లాడనని సోము వీరాజు అంటున్నారు. మొత్తానికి పవన్ బీజేపీ తరఫున ప్రచారం చేయాల్సిందే అన్న ఆరాటం కమలదళానికి ఉందని  తెలుస్తోంది. కానీ పవన్ ఉప ఎన్నికే వద్దు, ఏకగ్రీవం అయితే బెస్ట్ అంటూ చెప్పేశారు. ఆయన మాటను విన్నట్లుగా టీడీపీ కూడా బద్వేల్ లో పోటీ వద్దు అనుకుంది. అంటే నిజమైన మిత్రుడి మాదిరిగా టీడీపీ పవన్ నిర్ణయాన్ని సమర్ధించడమే కాదు తాను అమలు చేసింది.

కానీ తమకు ప్రాణ మిత్రుడు పవన్ అంటున్న బీజేపీ మాత్రం మొండిగా పోటీకి రెడీ అంటోంది. ఇక పవన్ని తెచ్చి ప్రచారం చేయిస్తామని చెప్పడం కూడా వింతా విడ్డూరమే.  మరి ఇదంతా పవన్ని టెస్ట్ చేయడానికా, లేక బద్వేల్ పోరుతో మిత్రుడి వ్యవహారం ఏంటన్నది చూడాలన్నా కోరిక ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పవన్ కేవలం ఒకే ఒక మీటింగ్ కి వచ్చి వెళ్ళారు. నాటితో పోలిస్తే బీజేపీ జనసేనల మధ్య సంబంధాల మధ్య మరింత ఎడం పెరిగింది అని వార్తలు వస్తున్న క్రమంలో సోము వీర్రాజు మాటలకు ఎన్నో అర్ధాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా బీజేపీ పోటీ చేస్తే మాత్రం ఈ మిత్ర బంధానికి అదే అసలైన శల్య పరీక్షగా మారుతుంది అంటున్నారు. చూడాలి మరి బద్వేల్ ఏం చేస్తోందో, ఏ తీరానికి ఎవరికి చేరుస్తుందో.
Tags:    

Similar News