బాలయ్య పంచింది కరెన్సీ కాదు, కరపత్రాలట

Update: 2017-08-21 17:27 GMT
నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతున్న‌ట్లుగా ఉన్న ఓ ఫొటో రీసెంటుగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిపోయింది. అంతేకాదు, నేషనల్ మీడియాలోనూ దీనిపై కథనాలు వచ్చాయి. అయితే... ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్ మాత్రం బాలయ్య పంచింది నోట్లు కాదని అంటున్నారు. ఆ రోజు బాలకృష్ణ చేతిలో ఉన్న‌వి కర ప‌త్రాల‌ని చెప్తున్నారు. క‌లెక్ట‌ర్ త‌మ‌కు అలాగే నివేదిక ఇచ్చార‌ని ఆయన అంటున్నారు.
    
కాగా నంద్యాల‌లో ఉప‌ ఎన్నిక ప్ర‌చారం ఈ రోజుతో ముగియడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిబంధనలు గుర్తు చేశారు. ఎన్నిక ముగిసే వ‌ర‌కు టీవీల్లో లేదా ప‌త్రిక‌ల్లో పోలింగ్‌ స‌ర్వే వంటివి వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఎల్లుండి సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో లైనులో ఉన్నవారంద‌రూ ఓట్లు వేయ‌వ‌చ్చని, ఆరు దాటాక పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చిన వారికి ఓటు వేసే అవ‌కాశం ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
    
మూడు ప్ర‌ధాన‌ పార్టీలూ ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నాయ‌ని అన్నారు. ఓట‌ర్ల‌ను ప్రలోభ పెట్టాల‌ని చూస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వని చెప్పారు. 15 వేల పైచిలుకు ఓట‌ర్ల‌కు ఇంకా ఓట‌రు స్లిప్పులు అంద‌లేదని, త్వ‌ర‌లోనే అందుతాయ‌ని తెలిపారు. పోలింగ్ ముగిసేవ‌ర‌కు మ‌ద్యం దుకాణాల మూసివేత ఆంక్ష‌లు ఉంటాయ‌ని చెప్పారు. పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎవ‌ర‌యినా తాము ఎవ‌రికి ఓటు వేశారో చెబితే కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. రాజ‌కీయ పార్టీలు బ‌ల్క్ ఎస్ఎమ్ఎస్ లు పంపించకూడదని అన్నారు.
Tags:    

Similar News