పీఏపై వేటు వేసిన బాలయ్య..?

Update: 2017-02-07 04:59 GMT
ఏపీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఇలాంటి ముచ్చట కనిపించదేమో. ఎమ్మెల్యేను పక్కన పెట్టేసి.. సదరు ఎమ్మెల్యే పీఏ షాడో ఎమ్మెల్యేగా మారిపోవటమే కాదు.. అతగాడి దెబ్బకు నియోజకవర్గంలోని అధికారపార్టీ నేతలు హాహాకారాలు చేయటమే కాదు.. అతగాడిపై చర్య తీసుకోకుంటే.. తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేసేస్తామంటూ ప్రకటించే సంచలనం ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

ఇంతలా జరుగుతున్న జిల్లా పార్టీ నాయకత్వం దగ్గర నుంచి.. రాష్ట్ర పార్టీ నాయకత్వం వరకూ చేష్టలుడిగినట్లుగా చూస్తుండిపోవటానికి కారణం.. ఆ నియోజకవర్గానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడైన బాలకృష్ణ నేతృత్వం వహించటమే. మూడునెలలకు ఒక్కసారి మాత్రమే నియోజకవర్గం వైపు చూసే బాలకృష్ణ.. తన నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలన్నీ చూసుకోవాల్సిందిగా బాగా సన్నిహితుడైన శేఖర్ కు బాధ్యతలు అప్పగిస్తూ.. పీఏ పోస్టు ఇచ్చారు.

పేనుకు పవర్ ఇస్తే తలంతా గోకిన చందంగా బాలకృష్ణ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. ప్రతి పనికి ఎంత ఇవ్వాలో రేటు ఫిక్స్ చేయటం సంచలనంగా మారింది. ఇతగాడి ఆరాచకాల గురించి బాలయ్యకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోవటం.. పార్టీ నాయకత్వానికి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిన వారిపై అనూహ్య రీతిలో క్రమశిక్షణా చర్య కింద వేటు పడటంతో.. పీఏ శేఖర్ మోస్ట్ పవర్ ఫుల్ గా మారటమే కాదు.. అతడు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.

ఇలాంటి వేళ.. హిందూపురం నియోజకవర్గ నేతలంతా ఒక్కతాటి మీదకు వచ్చి పీఏ శేఖర్ ఆరాచకాలపై గళం విప్పటం.. అదే సమయంలో ఒక కాంట్రాక్టర్ ను బెదిరించిన వైనానికి సంబంధించిన ఆడియోక్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బాలయ్య పీఏ ఆరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికి అర్థమయ్యే పరిస్థితి. నమ్మిన వారిని అంత తేలిగ్గా అనుమానించే తత్త్వం లేని బాలకృష్ణ.. తన పీఏ మీద వచ్చిన ఆరోపణలు.. విమర్శలపై పెద్దగా రియాక్ట్ కాలేదన్న మాట ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పీఏ శేఖర్ (చంద్రశేఖర్ నాయుడు) పై వేటు వేస్తూ.. విధుల నుంచి తప్పించినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సమాచారం బయటకు రానప్పటికీ.. పార్టీ అంతర్గతవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం శేఖర్ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వేగల ద్వారా క్రాస్ చెక్ చేసుకున్న బాలయ్య.. ఆయనపై వేటు వేసినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News