24 గంటలు హిందూపురం గురించే-బాలయ్య

Update: 2017-06-11 07:51 GMT
హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఎన్నికైనపుడు అక్కడి జనాలు చాలా సంతోషించారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి మళ్లీ ఆయన తనయుడు రావడం పట్ల సంబరాలు చేసుకున్నారు. మొదట్లో ఎమ్మెల్యేగా బాలయ్య పని తీరు కూడా బాగున్నట్లే అనిపించింది. కానీ ఈ మధ్య బాలయ్య నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య తీవ్రమైనా పట్టించుకోవట్లేదని.. సినిమాల్లో.. ఇతర కార్యక్రమాల్లో పడి నియోజకవర్గానికి రావడమే మానేశారని అక్కడి జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ సమస్యల్ని పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో  దున్నపోతు మీద బాలయ్య.. తెలుగుదేశం అని పేర్లు రాసి హిందూపురం జనాలు నిరసన వ్యక్తం చేయడమూ తెలిసిందే.

ఐతే బాలయ్య మాత్రం తాను నియోజకవర్గాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అంటున్నాడు. తాను ఎక్కడున్నా 24 గంటలూ తన నియోజకవర్గం గురించే ఆలోచిస్తుంటానని బాలయ్య తెలిపాడు. పోర్చుగల్ లో తన కొత్త సినిమా ‘పైసా వసూల్’ షూటింగులో పాల్గొంటూ అక్కడి నుంచి తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నియోజకవర్గం గురించి మాట్లాడాడు బాలయ్య. ‘‘నేను సినిమా షూటింగ్ లో పడితే కుటుంబం గురించి కూడా ఆలోచించను. పోర్చుగల్ వచ్చి నెల రోజులైంది. నా మనవడిని మిస్సవుతున్నా. ఐతే నేను ఎక్కడున్నా నన్ను ఎన్నుకున్న నా నియోజకవర్గం బాగు కోసం.. అక్కడి పనుల కోసం ఫోనులో సంప్రదిస్తూనే ఉంటా. అధికారులతో మాట్లాడుతూ ఉంటా. ఒకసారి పనిలో పడ్డాక నాకు నా సినిమా షూటింగ్.. నా నియోజకవర్గం పని తప్ప ఇంకేమీ మనసులో ఉండవు. నేను ఎక్కడికి వెళ్లినా హిందూపురం నియోజకవర్గాన్ని.. అక్కడి పనులను.. పురోగతినీ పర్యవేక్షిస్తూనే ఉన్నాను. 24 గంటలూ దాని గురించే ఆలోచిస్తుంటా. ఇండియాకు రాగానే పదిరోజుల పాటు షూటింగ్‌ కు పూర్తి విరామం ఇస్తున్నా. ఆ సమయంలో హిందూపురం వెళ్లి.. ప్రత్యక్షంగా అన్ని పనులూ పర్యవేక్షిస్తా. హిందూపురంలో మహమ్మదీయ సోదరులతో ఇఫ్తార్‌ విందులో పాల్గొంటాను. రంజాన్ వేడుకలూ అక్కడే జరుపుకుంటాను. అక్కడ నీటి సమస్యకు సంబంధించి ఇబ్బందులు తొలగిపోనున్నాయి’’ అని బాలయ్య అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News