బాలయ్య పవన్ సీక్రెట్ మీటింగ్...మ్యాటర్ అదేనా...?

Update: 2022-12-24 06:20 GMT
ఇద్దరూ టాలీవుడ్ స్టార్స్. ఇద్దరికీ అభిమాన జనం ధనంగా ఉంది. ఇద్దరికీ మరొక పోలిక ఉంది. అదేంటి అంటే రాజకీయాల్లో ఉండడం. అలాగే ఇద్దరికీ ఇంకో విశేషం ఉంది. కామన్ ప్రత్యర్ధి జగన్. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న టైం లో ఇపుడు ఇద్దరు నటులూ భేటీ అయ్యారు.

వారే నందమూరి బాలక్రిష్ణ, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరూ బాలయ్య షూటింగ్ జరిగే వీర సింహారెడ్డి సెట్ లో సమావేశం అయ్యారు. సడెన్ గా బాలయ్య షూటింగ్ స్పాట్ కి పవన్ కళ్యాణ్ రావడం నిన్నంతా వైరల్ గా మారిన సంగతి విధితమే. అయితే ఇందులో ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే ఆ పక్కనే హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ జరుగుతోంది.

అలా ఇద్దరు హీరోల సినిమాలు పక్క పక్కన షూటింగ్ జరుగుతూంటే ఒకరి సెట్ కి మరొకరు రావడం కామన్ గా జరిగేదే. అయితే ఇక్కడ రాజకీయం కూడా మిక్స్ కావడంతోనే ఈ భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. ఏపీలో తెలుగుదేశం జగన్ మీద కదం తొక్కుతోంది. జనసేన సైతం జగన్ పాలన లేని ఏపీని చూస్తామని చెబుతోంది.

దాంతో ఈ ఇద్దరు నటులు కం నాయకులు కలవడం మాత్రం సినీ పరంగానే కాదు రాజకీయంగానూ అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఇక వీర సింహారెడ్డి సెట్ లోనే బాలయ్య పవన్ ఇరవై నిముషాల సేపు ఏకాంతంగా భేటీ అయ్యారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోలు ఏమి మాట్లాడుకుని ఉంటారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

నిజానికి బాలయ్య పవన్ లు ఇంతకు ముందు  ఎక్కడా కలిసినట్లుగా కూడా పిక్స్ లేవు. పవన్ కెరీర్ ఆరంభంలో సుస్వాగతం సినిమాకు క్లాప్ కొట్టడానికి అప్పట్లో బాలయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ తరువాత కొన్నాళ్ళకు జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు సందర్భంగా పౌరాణిక పాత్రలకు ఎన్టీయార్  వాడిన సామగ్రితో గ్యాలరీ ఏర్పాటు చేస్తే దాన్ని చూసేందుకు మెగా హీరోలు వచ్చారు. అలా బాలయ్య చిరంజీవి, పవన్ లతో కలసిన ఫోటోలు ఉన్నాయి.

అది జరిగి కూడా పదిహేనేళ్ళు గడచింది. మరి ఇన్నేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ నేపధ్యంలో పవన్ సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు కూడా చూశారు. బాలయ్య కూడా 2014 నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఇద్దరు హీరోలూ ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఇద్దరూ కలసి ఒకే సెట్ కనిపించడం ఇద్దరూ కలసి ఫోటోలు దిగడం ఇదంతా ఒక ఎత్తు అయితే సీక్రెట్ గా ఏమి మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

మరి రాజకీయాల గురించా లేక అన్ స్టాపబుల్ షో గురించా లేక సినిమా గురించా లేక సరదా కబుర్లా అన్నది తెలియరావడంలేదు కానీ ఈ ఇద్దరి భేటీ మాత్రం చాలా రకాలైన ఊహాగానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా అటు నందమూరి ఇటు మెగా హీరో ఇద్దరూ కలసిన ఫోటో మాత్రం  సూపర్ లెవెల్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News