యూ ట్యూబ్ ఛానళ్ళు, వెబ్ సైట్లపై బ్యాన్

Update: 2021-12-22 07:32 GMT
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్ధాన్ వేదికగా భారత్ పై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్ళు, రెండు వెబ్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిఘా వర్గాల సమాచారం, సహకారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్, రామమందిరం, ఆర్మీ, మైనారిటీలు, సీడీఎస్, బిపిన్ రావత్ మరణం లాంటి సున్నితమైన అంశాలపై భారత్ వ్యతిరేక వార్తలు, కథనాలు వండి వారుస్తున్నాయి.

బ్యాన్ అయిన యూట్యూబ్ ఛానళ్లలో నయా పాకిస్ధాన్ గ్రూపుకు చెందినవే ఎక్కువున్నాయి. ఇపుడు బ్యాన్ అయిన ఛానళ్ళకు సుమారు 35 మంది సబ్ స్ర్కైబర్లున్నారు. ఈ ఛానళ్లలో ఎక్కువ వాటిలో పాకిస్తాన్ యాంకర్లే పనిచేస్తున్నారు. వీరంతా ఉద్దేశ్యపూర్వకంగా నే భారత్ వ్యతిరేక భావజాలాన్ని బాగా పెంచి పోషిస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ హక్కు చట్టం లాంటి అంశాలపై చర్చలను మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తు భారత్ వ్యతిరేకతను పెంచుతోంది.

అంతేకాకుండా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం మైనారిటీలను బీజేపీ+కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ చర్చా కార్యక్రమాలు కూడా ఒక పద్దతిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంటున్నట్లు నిఘావర్గాలు గ్రహించాయి. దాంతో వీటిపై కన్నేశాయి. వీటిల్లో జరిగే చర్చలను, పాల్గొంటున్న వారి వివరాలను, చర్చల చివరగా యాంకర్లు చెప్పే అభిప్రాయాలను నిఘావర్గాలు జాగ్రత్తగా గమనించాయి.

కొంతకాలంగా చర్చా వేదికల తీరు చూసిన తర్వాత పాకిస్ధాన్ ప్రేరేపిత యూట్యూబ్ ఛానళ్ళు కావాలనే భారత్ పై విషం చిమ్మిస్తున్నట్లు నిఘా వర్గాలకు అర్ధమైపోయింది. దాంతో ఇదే విషయమై ఒక రిపోర్టును తయారుచేసి కేంద్ర హోంశాఖ తో పాటు ప్రసారమంత్రిత్వ శాఖను అలర్ట్ చేసింది. దీనిపై అత్యున్నత స్థాయి సమీక్ష జరిగిన తర్వాత భారత్ లో యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దాంతో ఇండియాలో వాటిని బ్యాన్ చేయటమే కాకుండా ఇదే విషయాన్ని వాటి నిర్వాహకులకు కూడా సమాచారం ఇచ్చింది.
Tags:    

Similar News