'సొరంగంలో దాక్కున్నా వదలం.. జేసీబీలు పెట్టి చీల్చి జైలుకు పంపుతాం'

Update: 2022-01-10 04:40 GMT
అదే పనిగా జైలు జపం వినిపించే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి వెంట మరోసారి జైలు వ్యాఖ్యలు వచ్చాయి. తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపుతామని వ్యాఖ్యానించే ఆయన.. వారం క్రితం ఆయనే జైలుకు వెళ్లాల్సి రావటం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బెయిల్ మీద బయట ఉంటున్న ఆయన.. తాజాగా హన్మకొండలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఎప్పటిలానే సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పరుష వ్యాఖ్యలకు వెనుకాడలేదు.

సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం తన జీవిత లక్ష్యంగా చెప్పుకునే బండి సంజయ్.. తాజాగా మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ప్రసంగాన్ని చూస్తే.. సీఎం కేసీఆర్ ను ఏదోలా జైలుకు పంపటమే తన లక్ష్యమన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తాయి. నిజానికి.. ఈ తీరు కేసీఆర్ కు లాభం చేస్తుందన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. నిజానికి కేసీఆర్ తప్పులు ఏమైనా చేసి ఉంటే వాటిని ఆధారాలతో బయపెట్టటం బాగుంటుంది. అంతే తప్పించి.. అదే పనిగా సినిమా డైలాగులు మాదిరి.. కేసీఆర్ ను జైల్లో పెడతామనే మాటలు ఉండే కొద్దీ జోకింగ్ గా మారుతున్నాయని చెప్పాలి.

తాజాగా సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో కీలక అంశాల్ని చూస్తే..

- రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ ఉన్నా నిన్ను.. నీ కుటుంబాన్ని వదిలిపెట్టం. జైలుకు పంపుతాం. కేసీఆర్ పెద్ద దగాకోరు. దేశంలోనే అవినీతి ముఖ్యమంత్రి. ఆయన సొరంగంలో దాక్కున్నా వదలిపెట్టబోం. జేసీబీలు పెట్టి చీల్చి జైలుకు పంపుతాం.

- రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతుంది. రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేస్తాం. బదిలీలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపితే అన్ని పరిశీలించారో? లేదంటే.. ఎన్ని పరిష్కరించారో సీఎం కేసీఆర్ చెప్పాలి.

- బీజేపీ కార్యకర్తల తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. జనవరి 10వ తేదీ వచ్చినా 13 జిల్లాల్లో ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం అనేక కుట్రలు చేస్తున్నారు.

- రెండేళ్ల తర్వాత ప్రజలు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం. తనను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారు. కానీ, బీజేపీ కార్యకర్తలు భయపడరు.

- సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టాలి. వీళ్ళందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యోగులను ఎందుకింత వేధిస్తున్నారు? ఉద్యోగం వచ్చి స్థానికత కోల్పోయి ఏడుస్తుంటే కళ్లకు నీళ్లు వస్తున్నాయి. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుందా?

- సీనియర్లు జూనియర్లు పేరుతో ఉద్యోగుల్లో కొట్లాట పెట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరు. ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బెదిరిస్తుంది. ఇప్పటికే మానసిక క్షోభతో ఎనిమిది మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది మరణిస్తే మీకు మనస్సు కరుగుతుంది?

- కరోనా నిబంధనలను అనుసరించి దీక్ష చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తారా? ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మీ ఆరోగ్యం ఎవ్వరూ పాడుచేసుకోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవ్వరూ మద్దతు తెలిపిన వారు లేరు. తెలంగాణలో 13 జిల్లాల్లో పదో తేదీ వచ్చినా.. ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు రాలేదు.

- ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడు సీఎం కేసీఆర్. కమ్యూనిస్టు పార్టీతో కుమ్మక్కై చైనాకు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గడీల పాలనను బద్ధలు కొడుతుంది.

- ప్రధాని మోడీ ఫోన్ చేసి చెప్పారు.. ఉద్యోగుల కోసం పోరాడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పమని. ఉద్యోగుల కోసం పోరాడుతున్న తీరు అభినందనీయం. జాతీయ నాయకత్వం అండగా ఉంది.

- సూది, దబ్బనం అని హేళన చేసిన కమ్యూనిస్టు పార్టీలకు దావత్ ఇచ్చారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో చేయి కలుపుతున్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 317 జీవోతో ఉద్యోగులు ఎన్నో బాధలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని జీవో తయారు చేశారు. ఈ జీవో ద్వారా ముఖ్యమంత్రి ఏం సాధిస్తారు?

- ఇప్పటివరకు 8 మంది ఉద్యోగులు మనస్తాపం చెంది చనిపోయారు. ఇంకెంత మంది చనిపోతే సీఎం కనికరిస్తారు. సీఎం కుటుంబానికి సంక్రాంతి లేకుండా చేస్తాం. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలబోం. బండి సంజయ్‌ను లోపలేస్తే అంతా భయపడతారని కేసీఆర్ అనుకున్నారన్నారు.

- గ్యాస్ కట్టర్లతో నా కార్యాలయాన్ని బద్ధలు కొట్టారు. ఏ తప్పు చేయని బొడిగ శోభను జైల్లో పెట్టారు. 317 జీవోను వెంటనే సవరించాలి. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ జీవోను చెత్తబుట్టలో వేస్తామన్నారు.


Tags:    

Similar News