`సంగ్రామ యాత్ర` సాధించేదేంటి? బీజేపీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం

Update: 2021-08-29 09:30 GMT
అధికారమే ప‌ర‌మావ‌ధిగా.. తెలంగాణ బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌.. ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. అయితే.. ఈ యాత్ర‌తో బీజేపీ పుంజుకుంటుందా? అధికారంలోకి వ‌చ్చేస్తుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ఏపీతో పోల్చుకుంటే.. తెలంగాణ‌లో బీజేపీ కొంత మెరుగ్గానే ఉన్న‌ప్ప‌టికీ.. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ వంటి కీల‌క న‌గ‌రాలు.. జిల్లాలు త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో చూసుకుంటే.. రాష్ట్రంలో బీజేపీకి పెద్ద‌గా ప‌ట్టులేదు. ఈ విష‌యాన్ని ఎవ‌రో చెబితే త‌ప్ప‌ని అనుకుంటారేమో.. సాక్షాత్తూ.. ఇటీవ‌ల కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. ``మేం క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. కేడ‌ర్‌ను పెంచాల్సిన అవ‌స‌ర‌మూ ఉంది`` అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

సో.. దీనిని బ‌ట్టితెలంగాణ‌లో కొన్ని జిల్లాల‌ను మిన‌హాయిస్తే.. క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి ప‌ట్టు లేద‌నేది నిర్వివాదాంశం. అంతెందుకు ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతున్న హుజూరాబాద్‌లోనే బీజేపీ ప‌రిస్థితి(మాజీ మంత్రి ఈట‌ల‌ను ప‌క్క‌న‌పెడితే) ప్ర‌శ్నార్థ‌కం. మ‌రి అలాంటి స‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేకుండా.. పొలోమ‌ని పాద‌యాత్ర‌లు, సంగ్రామ యాత్ర‌లు చేప‌ట్టి ఏం చేస్తారు? అనేది విశ్లేష‌కులు ప్ర‌శ్న‌. అయిన‌ప్ప‌టికీ.. ఏదో `హ‌డావుడి` చేయాలి కాబ‌ట్టి బండి సంజ‌య్ ఇలా సంగ్రామ యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలావుంటే, కేడ‌ర్‌లోనూ స‌త్తువ క‌నిపించ‌డం లేదు. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌తా కొలిక్కిరావ‌డం లేదు. బండిని వ్య‌తిరేకించే వ‌ర్గం బాగానే పుంజుకుంటున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఆ సంగ్రామ యాత్ర‌.. విడ‌త‌ల‌వారీగా చేయాల‌ని నిర్ణ‌యించినా.. ఎప్పుడు ఆగుతుందో.. ఎక్క‌డ నిలిచిపోతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి! వచ్చే రెండేళ్లూ(ఎన్నికల వ‌ర‌కు) ఎక్కువ రోజులు పాదయాత్ర ద్వారా జనంలో ఉండబోతున్నాన‌ని బండి ప్ర‌క‌టించారు. అంతేకాదు.. టీఆర్ఎస్‌ మైనారిటీ సంతుష్టీకరణ విధానాలతో మెజారిటీ వర్గాలకు తీరని ద్రోహం జరుగుతోందన్న సంగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లతాన‌ని చెప్పారు. అయితే.. మైనారిటీ వ‌ర్గాలను ప‌క్క‌న పెట్టినా.. మెజారిటీ వ‌ర్గాల‌నైనాబీజేపీ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే... మెజారిటీ ప్ర‌జ‌ల్లో బీజేపీపై న‌మ్మ‌కం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అదే ఉంటే.. జీహెచ్ ఎంసీలో బీజేపీ ప‌ట్టు నిలుపుకొని పీఠం ద‌క్కించుకునేద‌నే వాద‌న ఉంది.

''దళిత బంధు ఇచ్చి టీఆర్ఎస్‌ ఆ వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, వారికిచ్చిన అసైన్డ్‌ భూములను పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల పేరిట లాక్కొంటోంది. వీటన్నింటినీ ఎత్తిచూపబోతున్నాం. గిరిజనుల రిజర్వేషన్‌ను మైనారిటీ రిజర్వేషన్లతో ముడిపెట్టి ఎలా వారిని మోసం చేస్తోందో వివరించబోతున్నాం'' అని బండి సంజ‌య్ అనుచ‌రుడు అన్నారు. అయితే.. ఈ వ‌ర్గాల‌ను సైతం త‌మ వెంట తిప్పుకోగ‌ల‌రా? అంటే.. అది కూడా క‌ష్ట‌మే.ఎందుకంటే.. గోమాంసం విక్ర‌యాల‌కు వ్య‌తిరేకం.. కేవ‌లం హిందూవాద‌మే ప్ర‌గ‌తి వాద‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నారు కాబ‌ట్టి!

అయితే.. ఇక్క‌డ ఒక్క విష‌యం మాత్ర‌మే ఆశాజ‌నంగా క‌నిపిస్తోంది. అదేంటంటే.. దేశ‌ బీజేపీ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు.. అందునా, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. తొలిదశలో 40 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 500 మంది పాదయాత్రీకులు సంజయ్‌ వెన్నంటి ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల్లో స్థానిక పార్టీ నాయకులు కనీసం 2,000 మంది ఉంటారు. ప్రతి రోజు ఒక చోట కనీసం 10 వేల మందితో సభ నిర్వహిస్తారు. రాత్రి బస, భోజనం, వసతి ఏర్పాట్లు అన్నీ సాదాసీదాగా ఉండాలని సంజయ్‌ నేతలకు నిర్దేశించారు. అయితే.. చెప్ప‌డానికి బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. చేత‌ల‌కు వ‌చ్చే స‌రికి ఇంత మందిని స‌మీక‌రించ‌డం..ఖ‌ర్చుచేయ‌డం వంటివి ప్ర‌శ్న‌లుగా మిగ‌లనున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News